KTR: ఐటీ పరిశ్రమలను హైదరాబాద్‌లోని నలు దిశాల విస్తరించేందుకు చర్యలు: కేటీఆర్
- కొత్త ప్రాంతాలకు ఐటీ పరిశ్రమల విస్తరణ
- త్వరలోనే నగరంలోని ఐటీ ఎగుమతుల విలువ లక్ష కోట్లకు..
- మౌలిక వసతులు కల్పించాల్సిన అవసరం ఉంది
- నగరంలోని నలుమూలల ఐటీ పరిశ్రమల ఏర్పాట్లతో ప్రయోజనాలు
హైదరాబాద్‌లో ఐటీ పరిశ్రమలను నలు దిశాల విస్తరించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఈరోజు బేగంపేట క్యాంపు కార్యాలయంలో పలువురు అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం ఉన్న ఐటీ క్లస్టర్లకు తోడుగా ఉప్పల్, నాగోల్, సనత్ నగర్, మేడ్చల్, కొంపల్లి వంటి కొత్త ప్రాంతాలకు ఐటీ పరిశ్రమలను విస్తరించేందుకు తీసుకోవాల్సిన చర్యలు, వ్యూహాలపైన ఈ సమీక్షా సమావేశంలో చర్చించారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత నగరంలో ఐటీ పరిశ్రమ జాతీయ సగటు కన్నా ఎక్కువగా వృద్ధిని నమోదు చేసుకుంటోందని, త్వరలోనే నగరంలోని ఐటీ ఎగుమతుల విలువ లక్ష కోట్లకు చేరుకుంటుందని తెలిపారు. ఈ మేరకు పెరుగుతోన్న ఐటీ పరిశ్రమకు అనుగుణంగా నగరంలో మౌలిక వసతులు కల్పించాల్సిన అవసరాన్ని ప్రభుత్వం గుర్తించిందన్నారు. ఈ మేరకు ఈరోజు జరిగిన సమీక్షా సమావేశంలో పోలీసు, ట్రాఫిక్, విద్యుత్, అర్అండ్‌బీ, జీహెచ్‌ఎంసీ, మెట్రో రైలు, హెచ్‌ఎండీఏల తరఫున తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో చర్చించారు.
ముఖ్యంగా ప్రస్తుతం ఐటీ పరిశ్రమ ఉన్న గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ వంటి ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనపై స్వల్పకాలిక లక్ష్యాలతో చేపట్టాల్సిన చర్యలపై ప్రణాళికలు రూపొందించాలని టీఎస్‌ఐఐసీ అధికారులను మంత్రి కేటీఆర్ ఆదేశించారు. దీంతో పాటు నూతనంగా ఏర్పాటు కానున్న మరో ఐటీ క్లస్టర్ కి కూడా ఇప్పటి నుంచే అన్ని వసతులు ఉండేలా చూడాలన్నారు. నూతనంగా ఏర్పాటు కాబోయే క్లస్టర్లతోపాటు, విస్తరించనున్న క్లస్టర్లలోనూ రోడ్ల విస్తరణ, మురికి కాల్వల నిర్మాణం, విద్యుత్ సరఫరా, నీటి సరఫరా మొదలైన అంశాలపైన పూర్తి స్థాయి కార్యాచరణ చేపట్టాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
తెలంగాణ ప్రభుత్వ విధానాల ఫలితంగా అనేక ఐటీ సంస్థలు నగరంలో నూతనంగా కార్యకలాపాలు చేపట్టేందుకు, ప్రస్తుతం ఉన్న వాటిని విస్తరించేందుకు ముందుకు వస్తున్నాయన్నారు. రానున్న ఐదేళ్లలో లక్షలాది ఉద్యోగాలు ఐటీ రంగంలో రానున్నాయని మంత్రి తెలిపారు. అయితే, ఈ పెరుగుదల ఒకే వైపు కాకుండా నగరంలోని నలుమూలల జరిగితే, భవిష్యత్తులో ట్రాఫిక్ సమస్యల వంటి ఇబ్బందులు తలెత్తవని, సమ్మిళిత అభివృద్ధి దిశగా ఐటీ పరిశ్రమను తీసుకెళతామని చెప్పారు.
ఈ పెరుగుదలలో భాగంగా అవసరమయిన పోలీస్ స్టేషన్లు, అగ్నిమాపక కేంద్రాలు, ఫీజిబులీటీ ఉన్న చోట్ల మెట్రో, ఎంఎంటీఎస్ స్టేషన్లు వంటి ఏర్పాట్లకు సిద్ధంగా ఉన్నామన్నారు. రాజేంద్రనగర్ తో పాటు ఇతర ప్రాంతాల్లో చేపట్టాల్సిన భూసేకరణ వంటి విషయాల్లో రెవెన్యూ, టీఎస్‌ఐఐసీ, రంగారెడ్డి జిల్లా యంత్రాగం వంటి శాఖల తీసుకోవాల్సిన చర్యలపైన ఈ సమావేశంలో చర్చించారు. ఈ సమీక్షా సమావేశంలో టీఎస్‌ఐఐసీ, హెచ్‌ఎండీఏ, జీహెచ్ఎంసీ, ముగ్గురు పోలీసు కమిషనర్లు, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లా కలెక్టర్లు, అర్అండ్‌బీ, వాటర్ వర్క్స్, విద్యుత్ శాఖాధికారులు పాల్గొన్నారు.