Kathi Mahesh: కత్తి మహేష్ ను ఏపీ నుంచి కూడా బహిష్కరించండి: బ్రాహ్మణ సంఘాలు
- తెలుగు రాష్ట్రాల్లో జీవించే హక్కును కత్తి మహేష్ కోల్పోయారు
- కత్తిని ఏపీ నుంచి బహిష్కరించకపోతే... పోరాటాన్ని తీవ్రతరం చేస్తాం
- ఇతర మతాలను కించపరిచే హక్కు ఎవరికీ లేదు
శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేసి, ఉద్రిక్తతలకు కారణమయ్యారనే ఆరోపణలతో కత్తి మహేష్ ను తెలంగాణ పోలీసులు హైదరాబాద్ నుంచి బహిష్కరించిన సంగతి తెలిసిందే. ఆరు నెలల పాటు కత్తిని బహిష్కరించినట్టు డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. ఈ నేపథ్యంలో, ఏపీ నుంచి కూడా మహేష్ ను బహిష్కరించాలని విజయవాడలోని బ్రాహ్మణ సంఘాలు డిమాండ్ చేశాయి. తెలంగాణ తరహాలోనే ఏపీ ప్రభుత్వం కూడా కత్తి మహేష్ పై చర్యలు తీసుకోవాలని కోరాయి. చర్యలు తీసుకోని పక్షంలో, తమ పోరాటాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించాయి.
కత్తి మహేష్ ఒక సంఘ విద్రోహశక్తి అని బ్రాహ్మణ సంఘాల నేతలు ఈ సందర్భంగా మండిపడ్డారు. ఇరు రాష్ట్రాల్లో కూడా జీవించే హక్కును ఆయన కోల్పోయారని చెప్పారు. మతవిద్వేషాలను రెచ్చగొట్టే అధికారం రాజ్యాంగం ఎవరికీ ఇవ్వలేదని... తన చర్యలతో రాజ్యాంగాన్ని సైతం కత్తి మహేష్ అవమానించారని అన్నారు. ఏ మతాన్నీ కించపరిచేలా వ్యాఖ్యానించే హక్కు ఎవరికీ లేదని చెప్పారు.