tourist: విదేశీ టూరిస్టులకు భారత ప్రభుత్వం షాక్.. ఉచిత సిమ్ కార్డుల పంపిణీ నిలిపివేత
- ఉచిత సిమ్ కార్డుల స్కీమ్‌ను ఎత్తివేసిన ప్రభుత్వం
- అవసరం లేదని భావించే తీసేసినట్టు చెప్పిన పర్యాటక శాఖ కార్యదర్శి
- పబ్లిక్ వైఫై, యాప్స్ అందుబాటులో ఉండడమే కారణం
దేశానికి వచ్చే విదేశీ పర్యాటకులకు అందించే ఉచిత సిమ్ కార్డుల స్కీమ్‌ను ప్రభుత్వం ఎత్తివేసింది. మామూలుగా భారత్‌లో అడుగుపెట్టే విదేశీయులు తమ కుటుంబాలతో సంబంధాలు కోల్పోతారు. దీంతో వారికి నిత్యం అందుబాటులో ఉంటూనే వివిధ ప్రాంతాలను సందర్శించే ఉద్దేశంతో పర్యాటక మంత్రిత్వ శాఖ వారికి ఉచితంగా సిమ్ కార్డులు అందించేది. వీసాలు ఇచ్చే సమయంలోనే ముందుగానే యాక్టివేట్ చేసిన సిమ్‌లు ఇచ్చేది. గతేడాది ఫిబ్రవరిలో ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. అయితే, తాజాగా ఈ పథకాన్ని నిలివేస్తున్నట్టు టూరిజం సెక్రటరీ రష్మీ వర్మ తెలిపారు. వాటి అవసరం అంతగా లేదన్న ఉద్దేశంతోనే ఈ పథకాన్ని ఎత్తివేస్తున్నట్టు చెప్పారు.
పర్యాటకుల్లో దాదాపు అందరూ సోషల్ మీడియా యాప్స్‌ను వాడుతున్నారని, అలాగే, విమానాశ్రయాలు సహా చాలా ప్రాంతాల్లో పబ్లిక్ వైఫై అందుబాటులో ఉండడంతో దానిని ఉపయోగించుకుని వారి కుటుంబాలతో నిత్యం టచ్‌లో ఉంటున్నారని వర్మ తెలిపారు. ఈ నేపథ్యంలో సిమ్‌ల అవసరం లేదని గుర్తించి ఈ పథకాన్ని ఎత్తివేసినట్టు వివరించారు.
ఈ పథకంలో భాగంగా 50 రూపాయల టాక్‌టైమ్, 50 ఎంబీల డేటా, 30 రోజుల కాలపరిమితితో కూడిన బీఎస్ఎన్ఎల్ సిమ్ కార్డులను విదేశీ పర్యాటకులకు అందించేవారు. అలాగే, 12 భాషల్లో 24 గంటలూ టూరిస్ట్ హెల్ప్ లైన్‌కు అందుబాటులో ఉండే సౌకర్యం వీటిలో ఉండేది. కాగా, గతేడాది తొలిసారి భారత్ సందర్శించిన విదేశీ పర్యాటకుల సంఖ్య కోటి దాటింది.