Adilabad District: ఆదిలాబాద్ రిమ్స్ లో శిశువు కిడ్నాప్... రెండు గంటల్లో పట్టేసిన పోలీసులు!
- పోలీసులకు సహకరించిన సాంకేతికత
- బిడ్డను అపహరించుకు పోయిన ఏఎన్ఎం
- నేరేడుగొండ వద్ద అదుపులోకి
అందుబాటులోకి వచ్చిన అధునాతన సాంకేతికత నేరగాళ్లను పట్టుకోవడంలో పోలీసులకు ఎంతో సాయం చేస్తున్నదనడానికి ఇది మరో నిదర్శనం. ఆదిలాబాద్ లోని రిమ్స్ ఆసుపత్రి నుంచి మగ శిశువు అపహరణకు గురికాగా, రంగంలోకి దిగిన పోలీసులు రెండు గంటల వ్యవధిలోనే శిశువును నేరేడుగొండ వద్ద గుర్తించి, తిరిగి తల్లి ఒడికి చేర్చారు.
పోలీసులు వెల్లడించిన మరింత సమాచారం ప్రకారం, పుష్పలత అనే మహిళ గతంలో రిమ్స్ లో ఏఎన్ఎంగా శిక్షణ తీసుకుంది. ఆమెకు ఆసుపత్రి లోనికి వెళ్లి వచ్చే దారులన్నీ తెలుసు. ఈ క్రమంలో గత రాత్రి వారం రోజుల వయసున్న మగ బిడ్డను ఆమె అపహరించుకుని వెళ్లింది. తన బిడ్డ మాయమైనాడన్న విషయాన్ని తెలుసుకున్న తల్లి ఆ విషయాన్ని అధికారుల దృష్టికి తేగా, రిమ్స్ డైరెక్టర్ అశోక్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
వెంటనే సమీపంలోని అన్ని పోలీసు స్టేషన్లను, హైవే పెట్రోలింగ్ వాహనాలను అప్రమత్తం చేసిన పోలీసులు, సీసీటీవీ ఫుటేజ్ లను పరిశీలించారు. నేరేడుగొండ వద్ద ఓ మహిళ, మరో యువకుడు బిడ్డతో వెళుతుంటే, పెట్రోలింగ్ పోలీసులు ఆపి విచారించారు. తాను రిమ్స్ లో బిడ్డను ప్రసవించానని, పుష్ప అనే పేరిట అడ్మిట్ అయ్యానని ఆమె చెప్పిన అబద్ధం పోలీసులకు కీలక క్లూ ఇచ్చింది.
రిమ్స్ లో ఆ పేరుతో ఎవరూ అడ్మిట్ కాలేదని, బిడ్డను కనలేదని క్షణాల్లో రికార్డులు చూసి వెరిఫై చేసుకున్న పోలీసులు, ఆమెను అరెస్ట్ చేసి వెనక్కు తెచ్చి, బిడ్డను తల్లి ఒడికి చేర్చారు. తనకు పిల్లలు లేకపోవడం వల్లే బిడ్డను అపహరించినట్టు పుష్పలత అంగీకరించింది. ఆమెపై కిడ్నాప్ కేసు నమోదు చేశామని, నేడు కోర్టు ముందు ప్రవేశపెడతామని పోలీసు అధికారులు తెలిపారు.