Nirbhaya: సుప్రీం తీర్పుతో నిర్భయ గ్రామంలో సంబరాలు.. గ్రామ దేవతకు పాలాభిషేకం!
- నిందితుల రివ్యూ పిటిషన్‌ను తోసిపుచ్చిన కోర్టు
- ఉరి సరైనదేనంటూ తీర్పు
- శిక్ష పడిన వెంటనే ఉరి తీయాలన్న నిర్భయ తాత
నిర్భయ కేసులో నిందితులు పెట్టుకున్న రివ్యూ పిటిషన్‌ను సోమవారం సుప్రీంకోర్టు తిరస్కరించింది. దోషులకు ఉరి సరైనదేనని స్పష్టం చేసింది. సుప్రీం తీర్పుపై నిర్భయ తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. సుప్రీం తీర్పుతో నిర్భయ సొంత ఊళ్లో సంబరాలు చేసుకున్నారు. తీర్పు వినగానే నిర్భయ సొంత గ్రామమైన ఉత్తరప్రదేశ్ లోని బాలియా జిల్లా మేద్వారా కలన్ లో సందడి నెలకొంది. ఆలయాల్లో గ్రామస్తులు పూజలు చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించి గ్రామ దేవతకు పాలాభిషేకం చేశారు.
శిక్ష విధించిన వెంటనే దోషులను ఉరి తీస్తే మళ్లీ నిర్భయ లాంటి ఘటనలు జరగకుండా ఉంటాయని ఆమె తాత లాల్జీసింగ్ అన్నారు. కాగా, డిసెంబరు 16, 2012లో జరిగిన నిర్భయ ఘటన దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగానూ సంచలనం సృష్టించింది. యువతిపై అత్యంత పాశవికంగా అత్యాచారానికి పాల్పడిన ఆరుగురు వ్యక్తులు, ఆ తర్వాత ఆమెను రోడ్డుపై విసిరేసి వెళ్లిపోయారు. తీవ్రంగా గాయపడిన నిర్భయ అదే ఏడాది డిసెంబరు 29న సింగపూర్‌లో చికిత్స పొందుతూ మృతి చెందింది.