Andhra Pradesh: ప్రెస్ నోట్: యువతకు విస్తృతమైన ఉపాధి అవకాశాల కోసం.. ప్రతిష్ఠాత్మక కార్యక్రమానికి ఏపీ సర్కారు శ్రీకారం
- అప్రెంటిస్ షిప్ విధానాన్ని స్వల్పకాలిక కోర్సులతో అనుసంధానం
- నైపుణ్య శిక్షణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం
- ‘ఇంప్లిమెంటేషన్ ఆఫ్ అప్రెంటిస్ షిప్ స్కీమ్ ఇన్ ఏపీ’ పేరుతో కాన్ఫరెన్స్
- వెబ్‌సైట్ http://jobskills.apssdc.in
యువతకు విస్తృతమైన ఉపాధి అవకాశాలు కల్పించాలన్న లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో ప్రతిష్ఠాత్మక కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఎపీఎస్‌ఎస్‌డీసీ) ఆధ్వర్యంలో అప్రెంటిస్ షిప్ సెల్ ను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే ఈ అప్రెంటిస్ షిప్ విధానం జర్మనీ, స్విట్జర్లాండ్, యూకే, స్వీడన్, ఆస్ట్రేలియా తదితర అభివృద్ధి చెందిన దేశాల్లో విజయవంతంగా అమలవుతోంది.
మన రాష్ట్రంలో ప్రస్తుతం అప్రెంటిస్ షిప్ ఐటీఐలు, తయారీ రంగ పరిశ్రమలకు మాత్రమే అనుసంధానమై ఉన్నాయి. అప్రెంటిస్ షిప్ విధానాన్ని స్వల్పకాలిక కోర్సులు, శిక్షణతో అన్ని రంగాలకు అనుసంధానం చేయడం ద్వారా మరింత మందికి నైపుణ్య శిక్షణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగానే దేశంలోనే తొలిసారిగా ఇంత విస్తృత శ్రేణిలో ‘ఇంప్లిమెంటేషన్ ఆఫ్ అప్రెంటిస్ షిప్ స్కీమ్ ఇన్ ఏపీ’ పేరుతో విశాఖపట్నంలోని నొవాటెల్ లో ఈనెల 11వ తేదీన కాన్ఫరెన్స్ నిర్వహించబోతోంది.
ఏపీ ఎస్‌ఎస్‌డీసీ, సీఐఐ ఆధ్వర్యంలో జరగనున్న ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం తరుఫున న్యాయ, నైపుణ్యాభివృద్ధి, యువజన, క్రీడలు, నిరుద్యోగ ప్రయోజనాలు, ఎన్నారై సంబంధాల మంత్రి కొల్లు రవీంద్ర, రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 300 పరిశ్రమలకు చెందిన ప్రతినిధులు, చిన్న, మధ్య తరహా సంస్థలు, ప్రభుత్వ రంగంలోని సంస్థల ప్రతినిధులు, కేంద్ర ప్రభుత్వం తరఫున పలువురు ఉన్నతాధికారులు హాజరుకానున్నారు.
ఈ అప్రెంటిస్ షిప్ విధానాన్ని అమలు చేసే సంస్థలకు శిక్షణ కోసం ఒక్కొక్క అభ్యర్థికిగాను 1500 రూపాయల చొప్పున ప్రోత్సాహకంగా ప్రతినెలా మంజూరు చేస్తారు. పరిశ్రమలు, సేవారంగంలోవున్న వారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. విశాఖలోని నొవాటెల్ లో ఈనెల 11వ తేదీ జరిగే కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆసక్తి ఉన్న పరిశ్రమలు, ట్రైనింగ్ పార్టనర్స్ http://jobskills.apssdc.in లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అధికారులు తెలిపారు. మరిన్ని వివరాల కోసం 0891-2555535, 9848283261 నంబర్లలో సంప్రదించవచ్చు.