green: పచ్చదనం ఉట్టిపడేలా.. హైటెక్‌ సిటీలోని బొటానిక‌ల్ గార్డెన్ మరింత అభివృద్ధి!

  • దాదాపు రూ.5 కోట్ల నిధులతో పనులు
  • దశల వారీగా అభివృద్ధి 
  • గార్డెన్‌లో యోగా షెడ్, టెంట్, ట్రీ కాటేజ్, లాగ్ హ‌ట్, వాక‌ర్స్ పార్క్
  • చిన్న పిల్ల‌ల కోసం ప్ర‌త్యేకంగా పనులు

హైద‌రాబాద్‌లో కాంక్రీట్ జంగిల్‌గా మారిన హైటెక్‌సిటీ పరిసరాల్లో బొటానికల్ గార్డెన్‌ లాంటి పచ్చదనంతో నిండిన ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు పనులు కొన‌సాగుతున్నాయ‌ని తెలంగాణ గృహ నిర్మాణ‌, న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి తెలిపారు. బొటానికల్ గార్డెన్‌లో చేపట్టిన అభివృద్ధి పనులను ఈరోజు ఆయన ప‌రిశీలించారు.

ప్ర‌భుత్వ స‌ల‌హాదారు రాజీవ్ శ‌ర్మ‌, పీసీసీఎఫ్ ప్రశాంత్ కుమార్ ఝా, అటవీ అభివృద్ధి సంస్థ ఎండీ చందన్ మిశ్రాలతో క‌లిసి ఇంద్రకరణ్‌ రెడ్డి.. వెదురు ఉత్ప‌త్తుల‌తో నిర్మించిన అట‌వీ శాఖ కార్యాల‌యం, ప‌ర్యావ‌ర‌ణ విజ్ఞాన కేంద్రం ఎడారి మొక్క‌ల‌ను పెంచిన కాక్ట‌స్ గార్డ‌న్, బ‌ట్ట‌ర్ ఫ్లై పార్క్ ను సంద‌ర్శించారు. అనంత‌రం ఆయన మాట్లాడుతూ... దాదాపు రూ.5 కోట్ల నిధులతో భారీ స్థాయిలో గార్డెన్‌ను దశల వారీగా అభివృద్ధి చేస్తోన్న యోగా షెడ్, టెంట్, ట్రీ కాటేజ్, లాగ్ హ‌ట్, వాక‌ర్స్ పార్క్, చిన్న పిల్ల‌ల కోసం ప్ర‌త్యేకంగా నిర్మిస్తున్న వీడియో హాల్, ఇండోర్, అవుట్ డోర్ అభివృద్ధి ప‌నుల గురించి ఆయన వివ‌రించారు.

త్వ‌ర‌లోనే వీటిని అందుబాటులోకి తీసుకురానున్న‌ట్లు అధికారులు తెలిపారు. ఈ సంద‌ర్భంగా మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి మాట్లాడుతూ... సీఎం కేసీఆర్‌ ఆలోచన మేరకు అటవీ సంపదను కాపాడేందుకు ప్రభుత్వ యంత్రాంగం ముందుకుసాగుతుంద‌న్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేర‌కు బొటానిక‌ల్ గార్డెన్ అభివృద్ది ప‌నుల‌ను పరిశీలించినట్లు వెల్ల‌డించారు.

గతంలో ప్రైవేట్ అధీనంలో ఉన్న బొటానికల్ గార్డెన్ కళాహీనంగా మారిందని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు అనంతరం కేసీఆర్ ఆదేశాల మేర‌కు అటవీ అభివృద్ధి సంస్థ ప‌లు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టింద‌ని ఇంద్రకరణ్‌ రెడ్డి అన్నారు. అటవీ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో సహజత్వం దెబ్బతినకుండా ప్రత్యేకంగా ఎకో ఫ్రెండ్లీ నిర్మాణాలు చేపడుతున్నార‌ని వెల్ల‌డించారు. మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి వెంట బొటానిక‌ల్ గార్డెన్ వాక‌ర్స్ అసోసియేష‌న్ ప్ర‌తినిధులు కూడా ఉన్నారు.     

  • Loading...

More Telugu News