Supreme Court: వారికి ఉరే సరి... 'నిర్భయ' కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు!
- ఉరిశిక్షను యావజ్జీవ శిక్షగా మార్చాలంటూ దోషుల రివ్యూ పిటిషన్
- తోసిపుచ్చిన న్యాయస్థానం
- కింది కోర్టులు ఇచ్చిన తీర్పులను సమర్థించిన సుప్రీంకోర్టు
నిర్భయ కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. ఈ కేసులో దోషులు వేసిన రివ్యూ పిటిషన్‌పై విచారణ జరిపిన త్రిసభ్య ధర్మాసనం దాన్ని తోసిపుచ్చింది. ఈ కేసులో గతంలో ఢిల్లీ హైకోర్టుతో పాటు కింది కోర్టు ఇచ్చిన తీర్పులను సమర్థించింది. రివ్యూ పిటిషన్ వేసిన ముగ్గురు దోషులకు ఉరి శిక్షే సరి అని స్పష్టం చేసింది.
కాగా, 2012 డిసెంబరు 16న జరిగిన నిర్భయ హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించి, అత్యాచారాలపై కఠిన చట్టాలను తేవడానికి కారణమైన విషయం తెలిసిందే. ఈ కేసులో దోషులుగా తేలిన అక్షయ్, వినయ్ శర్మ, పవన్, ముఖేశ్‌లకు ఉరిశిక్షను ఖరారు చేస్తూ గతంలో తీర్పు వెలువడింది. అయితే, తమకు విధించిన ఉరిశిక్షను యావజ్జీవ శిక్షగా మార్చాలంటూ ఆ నలుగురిలో ముగ్గురు దోషులు రివ్యూ పిటిషన్ వేయగా సుప్రీంకోర్టు ఈ తీర్పు వెల్లడించింది.