kathi mahesh: కత్తి మహేష్ కు 6 నెలల నగర బహిష్కరణ.. సిటీలో అడుగుపెడితే, మూడేళ్లు జైలే: డీజీపీ మహేందర్ రెడ్డి

  • భావ వ్యక్తీకరణ పేరుతో ఇష్టానుసారం మాట్లాడితే ఊరుకోబోం
  • ప్రజల మనోభావాలను కించపరిస్తే కఠిన చర్యలు తీసుకుంటా
  • అలాంటి వారికి సహకరించే వారిపై కూడా చర్యలు తప్పవు

భావ వ్యక్తీకరణ ప్రాథమిక హక్కే అయినప్పటికీ... ఇష్టానుసారం మాట్లాడుతూ, సమాజంలో ఉద్రిక్తతలకు కారణమయ్యేవారిని ఉపేక్షించబోమని, కఠినమైన చర్యలు తీసుకుంటామని తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి హెచ్చరించారు. ఎవరైనా సరే ఎదుటి వ్యక్తుల మనోభావాలను కించపరిచేలా మాట్లాడితే, చర్యలు తీసుకుంటామని చెప్పారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్న సినీ క్రిటిక్ కత్తి మహేష్ ను ఆరు నెలల పాటు హైదరాబాద్ నగరం నుంచి బహిష్కరిస్తున్నామని తెలిపారు. హైదరాబాద్ నుంచి ఆయనను తీసుకెళ్లి, ఆయన స్వస్థలమైన చిత్తూరు జిల్లాలో విడిచి పెట్టేందుకు ఏర్పాట్లు చేయడం జరిగిందని చెప్పారు. ఈ ఆరు నెలల్లో కత్తి మహేష్ హైదరాబాదులో అడుగుపెట్టేందుకు యత్నిస్తే... అది నేరమవుతుందని తెలిపారు. మూడేళ్ల జైలు శిక్షకు ఆయన అర్హులవుతారని చెప్పారు.

ఏ రాష్ట్రానికి చెందినవారైనా హైదరాబాదులో ప్రశాంతంగా బతకొచ్చని... కానీ, సమాజంలో ఉద్రిక్తతలకు కారణమయ్యేలా ఎవరు ప్రవర్తించినా ఊరుకోబోమని డీజీపీ తెలిపారు. ఇలాంటి వ్యక్తులకు సహకరించే వారిపై కూడా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇలాంటి వార్తలకు ఎక్కువ ప్రచారం కల్పించరాదని మీడియాను కోరుతున్నామని తెలిపారు. ప్రోగ్రామ్ కోడ్ ను అతిక్రమించిన ఛానళ్లకు నోటీసులిచ్చామని వెల్లడించారు. సోషల్ మీడియాను కూడా జాగ్రత్తగా ఉపయోగించాలని చెప్పారు.

గత నాలుగేళ్లుగా తెలంగాణలో శాంతిభద్రతలు బాగున్నాయని... ఇకపై కూడా రాష్ట్రం శాంతియుతంగానే ఉండాలని డీజీపీ తెలిపారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు ఎవరు విఘాతం కలిగించినా, రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకున్నవారు అవుతారని చెప్పారు.  

kathi mahesh
dgp
mahender reddy
  • Loading...

More Telugu News