Malayalam: మలయాళ టీవీ నటిని వేధించిన దర్శకుడు.. ఫిర్యాదు చేసినందుకు తొలగింపు!
- టీవీ నటికి దర్శకుడు ఉన్నికృష్ణన్ వేధింపులు
- అమెరికా వెళ్లి వచ్చే సరికి సీరియల్ నుంచి తొలగింపు
- ఫిర్యాదు చేసినందుకేనన్న నిషా సారంగ్
మలయాళం టాప్ సీరియల్ ‘ఉప్పుం ములకుం’లో ప్రధాన పాత్ర పోషిస్తున్న నటి నిషా సారంగ్‌ను ఆ సీరియల్ నుంచి అర్ధంతరంగా తొలగించారు. ఈ సీరియల్ దర్శకుడు ఆర్. ఉన్నికృష్ణన్ తనను వేధిస్తున్నాడని, అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని నటి ఆరోపించారు. అతడి వేధింపులపై చానల్ నిర్వాహకులకు ఫిర్యాదు కూడా చేసింది. దీంతో కక్ష పెంచుకున్న దర్శకుడు ఉన్ని కృష్ణన్ ఆ సీరియల్ నుంచి ఆమెను తొలగించాడు. సీరియల్ నుంచి ఆమెను తప్పించినట్టు తెలుసుకున్న వీక్షకులు సోషల్ మీడియా ద్వారా ఆమె తరపున పోరాడుతున్నారు. ఆమెకు న్యాయం చేయాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు.
సీరియల్ షూటింగ్ ప్రారంభమైనప్పటి నుంచే అతడి ప్రవర్తనలో తేడాను తాను గమనించానని బాధిత నటి నిషా పేర్కొంది. ఆయన పంపే అసభ్యకరమైన సందేశాలను తాను పట్టించుకోవడం మానేశానని, అయినప్పటికీ అతడి ప్రవర్తనలో మార్పు రాలేదని తెలిపింది. అయితే, ఫిర్యాదు చేస్తే తనను ఈ సీరియల్ నుంచి తొలగిస్తారన్న భయంతో ఆ విషయాన్ని చాలాకాలం బయటపెట్టలేదని వివరించింది. ఇటీవల ఓ అవార్డుల కార్యక్రమం కోసం అమెరికా వెళ్లి వచ్చే సరికి సీరియల్ నుంచి తనను తొలగించారని ఆవేదన వ్యక్తం చేసింది. సెట్‌లో తనను వేధించిన విషయం ప్రతి ఒక్కరికీ తెలుసని, ఒకవేళ మళ్లీ ఈ సీరియల్‌లోకి తనను తీసుకున్నా వేధింపులు తప్పవని పేర్కొంది.