neet: విద్యార్థులకు శుభవార్త.. ఇకపై నీట్, జేఈఈ ప్రవేశపరీక్షలు ఏడాదికి రెండు సార్లు!
- ప్రతి ఏటా ఫిబ్రవరి, మే నెలల్లో నీట్
- జనవరి, ఏప్రిల్ లలో జేఈఈ
- కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి జవదేవకర్ ప్రకటన
ఇకపై నీట్, జేఈఈ (మెయిన్స్), యూజీసీ నెట్, సీమ్యాట్ ప్రవేశ పరీక్షలను ఏడాదికి రెండు సార్లు నిర్వహించనున్నట్టు కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి జవదేకర్ ప్రకటించారు. ఈరోజు ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రస్తుతం ఈ పరీక్షలన్నింటినీ సీబీఎస్ఈ నిర్వహిస్తోందని, ఇకపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నిర్వహించనుందని చెప్పారు.
ప్రతి ఏటా ఫిబ్రవరి, మే నెలల్లో నీట్; జనవరి, ఏప్రిల్ లలో జేఈఈ పరీక్షలు నిర్వహిస్తామని, విద్యార్థులు రెండుసార్లు నీట్ రాస్తే వచ్చే స్కోర్లలో బెస్ట్ స్కోర్ ను పరిగణనలోకి తీసుకుంటామని తెలిపారు. ఆయా ప్రవేశ పరీక్షలను ఆయా నెలల్లో 4 లేదా 5 తేదీల్లో ఆన్ లైన్ ద్వారా నిర్వహించనున్నట్టు చెప్పారు. ప్రవేశ పరీక్షల కోసం విద్యార్థులు తమ ఇళ్లల్లో లేదా అధికారికంగా గుర్తించిన కంప్యూటర్ సెంటర్లలో ఉచితంగా ప్రాక్టీస్ చేసుకోవచ్చని తెలిపారు.
అధికారికంగా గుర్తించిన కంప్యూటర్ సెంటర్ల వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని, ఆయా ప్రవేశ పరీక్షలకు సంబంధించిన సిలబస్, ప్రశ్నల ఫార్మాట్, భాష, ఫీజుల్లో మాత్రం ఎలాంటి మార్పు ఉండబోదని జవదేకర్ స్పష్టం చేశారు. కాగా, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల లక్షలాది మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది.