Maharashtra: ఖాళీ బీరు బాటిళ్ల కారణంగా మూసుకుపోయిన డ్రైనేజీ.. వాయిదా పడిన మహారాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు
- అసెంబ్లీ భవనంలో నిలిచిపోయిన విద్యుత్ సరఫరా
- ట్రాన్స్‌ఫార్మర్ గదిలోకి చేరిన నీరు
- 57 ఏళ్ల తర్వాత వర్షాల కారణంగా అసెంబ్లీ వాయిదా
శుక్రవారం కురిసిన భారీ వర్షాల కారణంగా మహారాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు వాయిదా పడ్డాయి. డ్రైనేజీ పైపులు మూసుకుపోవడంతో నీరు బయటకు వెళ్లే మార్గం లేక నాగ్‌పూర్ విధాన భవన్‌లోని ట్రాన్స్‌ఫార్మర్ గదిలోకి ప్రవేశించింది. ఫలితంగా విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో చీకట్లు అలముకున్నాయి. దీంతో మరో మార్గం లేక ఉభయ సభలను స్పీకర్ హరిబావ్ బగాడే వాయిదా వేశారు.
అసెంబ్లీలోని ట్రాన్స్‌ఫార్మర్ గదిలోకి అసలు నీరెలా వచ్చిందన్న పరిశీలనలో విస్తుపోయే విషయం వెల్లడైంది. ఖాళీ బీరు బాటిళ్లు, ప్లాస్టిక్ సంచుల కారణంగా డ్రైనేజీ బ్లాక్ అయింది. దీంతో నీరు పోయే మార్గం లేక ట్రాన్స్‌ఫార్మర్ గదిలోకి ప్రవేశించినట్టు స్పీకర్ పరిశీలనలో తేలింది. కాగా, వర్షాల కారణంగా అసెంబ్లీ వాయిదా పడడం 57 ఏళ్ల తర్వాత ఇది రెండోసారి. 1961లో ఒకసారి ఇలాగే జరిగింది.