New Delhi: అవును.. వారి ఆత్మహత్యలకు నేనే కారణం.. ఢిల్లీ డెత్ మిస్టరీలో కీలక మలుపు!
- పోలీసుల అదుపులో తాంత్రిక మహిళ
- ఆత్మహత్యలకు పురికొల్పింది తానేనని అంగీకారం
- ఎలా చనిపోవాలో కూడా చెప్పానన్న తాంత్రికురాలు
ఢిల్లీలోని బురారీ సామూహిక ఆత్మహత్యల కేసులో మిస్టరీ క్రమంగా వీడుతున్నట్టు కనిపిస్తోంది. కేసును దర్యాప్తు చేస్తున్న క్రైం బ్రాంచ్ పోలీసులు ‘గీతా మా’ అనే తాంత్రికురాలిని అదుపులోకి తీసుకున్నారు. భాటియా కుటుంబాన్ని ఆత్మహత్యలకు ప్రేరేపించింది తానేనని గీతా మా కెమెరా సాక్షిగా అంగీకరించినట్టు తెలుస్తోంది. 11 మందిని ఆత్మహత్యలకు పురిగొల్పింది తానేనని చెబుతున్న గీతా మా వీడియోను శుక్రవారం ‘సీఎన్ఎన్ న్యూస్ 18’ ప్రసారం చేసింది. ‘‘వారిని ఆత్మహత్యల వైపు నడిపించింది నేనే. వారు తమ జీవితాలను ఎలా అంతం చేసుకోవాలో వివరంగా చెప్పా’’ అని అందులో పేర్కొంది.
భాటియా ఇంటిని నిర్మించిన కాంట్రాక్టర్ వద్ద పనిచేసిన ఓ ఉద్యోగి కుమార్తే గీతా మాగా అధికారులు గుర్తించారు. అయితే, ఆమె అంగీకారాన్ని అధికారులు ఇంకా ధ్రువీకరించలేదు. బురారీ ఆత్మహత్యలు ఆదివారం వెలుగులోకి వచ్చి సంచలనమయ్యాయి. పదిమంది ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోగా, ఇంటి పెద్దావిడ నారాయణ్ దేవి మంచంపై అచేతనంగా పడి ఉన్నారు. అటాప్సీ నివేదికలో మాత్రం వారు ఇష్టపూర్వకంగానే ఆత్మహత్యలకు పాల్పడినట్టు తేలింది. భాటియా ఇంట్లోంచి స్వాధీనం చేసుకున్న డైరీలు కూడా ఇందుకు ఊతమిస్తున్నాయి. కాగా, గీతా మాను విచారించిన అనంతరం మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.