Tripura: వదంతుల వల్ల గ్రామస్తులు దాడి చేస్తున్న ఘటనలపై త్రిపుర సీఎం విచిత్ర కామెంట్స్!
- అమాయకులపై పెరిగిపోతోన్న దాడులు
- స్పందన అడిగిన మీడియా
- తన ముఖం చూడండని, ఆనందంతో వెలిగిపోతోందన్న సీఎం
- తనలాగే రాష్ట్రంలోని ప్రజలు ఆనందంతో ఉన్నారని వ్యాఖ్య
వాట్సప్‌తో పాటు పలు సామాజిక మాధ్యమాల్లో వస్తోన్న పుకార్ల కారణంగా దేశంలోని పలు చోట్ల ఉద్రిక్తతలు చోటు చేసుకుంటోన్న విషయం తెలిసిందే. పిల్లల్ని ఎత్తుకెళ్లే వారు చెలరేగిపోతున్నారంటూ వస్తోన్న ప్రచారం కారణంగా ఇటీవలే పలు ప్రాంతాల్లో అమాయకులని కొట్టి చంపిన ఘటనలు ఆందోళన రేకెత్తిస్తున్నాయి. కాగా, ఈ విషయంపై మీ స్పందన ఏంటని పాత్రికేయులు అడగగా త్రిపుర ముఖ్యమంత్రి విప్లవ్ కుమార్ దేవ్ సంచలన వ్యాఖ్య చేసి షాక్ ఇచ్చారు.
త్రిపురలో ఎవరైనా అనుమానితులుగా కనిపిస్తే గ్రామస్తులు దాడి చేస్తున్న ఘటనలపై మీరేంమంటారని అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇస్తూ... తన ముఖం చూడండని, ఆనందంతో వెలిగిపోతోందని, అలాగే తనలాగే రాష్ట్రంలోని ప్రజలు ఆనందంతో ఉన్నారని వ్యాఖ్యానించారు. అనంతరం ఒక్క క్షణం ఆలోచించి మళ్లీ పాత్రికేయులతో మాట్లాడుతూ తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకోవద్దని, తాను అగర్తల విమానాశ్రయాన్ని ఉద్దేశించి ఇలా అన్నానని చెప్పుకొచ్చారు. కాగా, ఇటీవల ఆ విమానాశ్రయానికి ‘మహారాజా వీర్ విక్రమ్ మాణిక్య కిశోర్ ఎయిర్‌పోర్టు’గా నామకరణం చేశారు.
కాగా, విప్లవ్ కుమార్ దేవ్ గతంలోనూ పలుసార్లు సంచలన వ్యాఖ్యలు చేశారు. కొన్ని రోజుల క్రితం ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. మహాభారత కాలం నాటికే ఇంటర్నెట్, ఉపగ్రహ వ్యవస్థ మనకు అందుబాటులో ఉన్నాయని అన్నారు.