Sri Chaitanya Junior College: ఎంసెట్ లీకేజీ స్కామ్ లో శ్రీ చైతన్య కళాశాలల డీన్ ... విస్తుపోయే నిజాలు!

  • ఆరు కళాశాలలకు డీన్ గా ఉన్న వాసు బాబు అరెస్ట్
  • ఒక్కొక్కరి నుంచి రూ. 35 లక్షలు వసూలు చేసిన వాసుబాబు
  • మంచి ర్యాంకులు పొందేందుకు పేపర్ లీక్

తెలంగాణలో జరిగిన 2016 ఎంసెట్ లీకేజీ కుంభకోణం కేసులో శ్రీ చైతన్య జూనియర్ కాలేజీ డీన్ ప్రమేయం ఉందంటూ సిన్న సీఐడీ పోలీసులు, తమ విచారణలో విస్తుపోయే నిజాలను బయటపెట్టారు. ఇప్పటివరకూ ఈ హై ప్రొఫైల్ కేసులో 64 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు, తాజాగా, ఆరు క్యాంపస్ లకు డీన్ గా ఉన్న వి.వాసుబాబు, నారాయణ, శ్రీ చైతన్య కాలేజీల మధ్యవర్తి కె.వెంకట శివనారాయణరావులను వారి నివాసంలో సీఐడీ ఎస్పీ జె.పరిమళ హనా అరెస్ట్ చేసి, వారిని 89, 90గా కేసులో నిందితులుగా చేర్చారు.

ఇక వారిని విచారించిన పోలీసులు, వారి కాల్ డేటా రికార్డులను పరిశీలించారు. విద్యార్థులకు కటక్ లో ఓ క్యాంపు ఏర్పాటు చేసి, ముందుగానే బయటకు వచ్చిన పేపర్ ను వారికి ఇచ్చి, మంచి ర్యాంకులను సాధించేందుకు వీరు సహకరించారన్నది వారిపై వచ్చిన ప్రధాన ఆరోపణ. ఈ కేసులో ప్రధాన నిందితులైన డాక్టర్ ధనుంజయ్, తాఖీర్, డాక్టర్ సందీప్ కుమార్ లతో వీరు అనునిత్యం టచ్ లో ఉన్నారని, ఎంబీబీఎస్ లో ప్రవేశం కోరే విద్యార్థులకు వీరు చట్ట వ్యతిరేక మార్గాల్లో సహకారాన్ని అందించారని తేల్చారు.

వాసు బాబు, శివనారాయణరావులు ఫిబ్రవరి నుంచి జూలై 2016 మధ్య పలుమార్లు నిందితులను కలిశారని, క్వశ్చన్ పేపర్ లీక్ గురించి మాట్లాడుకున్నారని వెల్లడించారు. ప్రశ్నా పత్రాలను ముందుగానే కోరుకునే విద్యార్థుల జాబితాను వీరే అందించారని కూడా విచారణలో వెల్లడైంది. కటక్ లో ఆరుగురు విద్యార్థులతో ఓ క్యాంప్ ఏర్పాటు చేసిన వీరు, జూలై 9, 2016న పేపర్ ను లీక్ చేశారని, వీరిలో ముగ్గురు విద్యార్థులు మంచి ర్యాంకులను సాధించారని ఎస్పీ విడుదల చేసిన అధికారిక పత్రికా ప్రకటనలో వెల్లడించారు.

ఇందుకోసం ఒక్కో విద్యార్థి నుంచి వాసు బాబు, శివనారాయణలు రూ. 35 లక్షల చొప్పున తీసుకున్నారని, ప్రధాన నిందితులకు కమిషన్లు చెల్లించారని సీఐడీ అధికారులు వెల్లడించారు. విద్యార్థుల తల్లిదండ్రులతోనూ వీరు మాట్లాడారని, వారి వద్దకు బ్రోకర్లను పంపి, డబ్బిస్తే మంచి ర్యాంకులతో పాటు, మంచి కాలేజీల్లో సీట్లను ఆఫర్ చేశారని చెప్పారు. ఇక ఇదే విషయమై శ్రీ చైతన్య గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యూషన్స్ అకడమిక్ డైరెక్టర్ సుష్మాను సంప్రదించగా, అరెస్టులపై తమకింకా సమాచారం అందలేదని, కేవలం వార్తల ద్వారా తెలిసిందని, ఇది అతని వ్యక్తిగత విషయమని, సంస్థతో సంబంధం లేదని వెల్లడించడం గమనార్హం.

Sri Chaitanya Junior College
MBBS
EMCET
Question Paper Leak
CID
Vasu Babu
Police
Arrest
Hyderabad
  • Loading...

More Telugu News