Pawan Kalyan: పవన్ కల్యాణ్ పై నిప్పులు చెరిగిన టీడీపీ నేత బండారు

  • వందలాది ఎకరాల భూములను ఆక్రమించానన్నది అబద్ధం
  • ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ చూసి పవన్ మాట్లాడటం కరెక్టు కాదు
  • తప్పుడు మాటలు మాట్లాడొద్దు

వందలాది ఎకరాల భూములను తాను, తన కొడుకు ఆక్రమించామని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని, పవన్ కు దమ్ముంటే.. ఈ ఆరోపణలు రుజువు చేయాలని టీడీపీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి సవాల్ విసిరారు.
 
విశాఖపట్టణంలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ముదుపాక భూముల విషయమై పవన్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, నిజంగా, వందలాది ఎకరాల భూములను తాను ఆక్రమించినట్టయితే, ఈపాటికి మీడియా తనను బయటపెట్టేదని అన్నారు. ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ ను చూసి పవన్ కల్యాణ్ మాట్లాడటం కరెక్టు కాదని, వ్యక్తిగతంగా మాట్లాడాలంటే తాను కూడా చాలా విషయాలు మాట్లాడగలనని, ఈ విషయం పవన్ కల్యాణ్ గుర్తుంచుకోవాలని హితవు పలికారు.

‘పవన్ కల్యాణ్ గారు కొత్తగా రాజకీయాలు నేర్చుకున్నారు. నేను చిన్నప్పటి నుంచే రాజకీయాలు నేర్చుకున్నా. ఎమ్మెల్యేగా, మంత్రిగా కూడా చేశాను. ఇప్పటి వరకూ నాపై ఎలాంటి ఆరోపణలు లేవు. నేను ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసినప్పుడు నన్నెవరూ వేలెత్తి చూపించలేదు. నేను, నా కొడుకు కలిసి వంద కోట్ల ఆస్తి సంపాదించామని పవన్ ఆరోపించారు.

2004, 2009, 2014లో నేను ఇచ్చిన ఎన్నికల డిక్లరేషన్స్ కావాలంటే పవన్ కు పంపుతాను... 2009, 2014లో కన్నా ఇప్పుడు నాకు ఒక ఎకరా, ఒక రూపాయి, ఒక బిల్డింగ్, ఒక బ్యాంకు అకౌంట్ గానీ ఎక్కువ ఉన్నట్టు మీరు (పవన్) చూపించగలిగితే, మీరు ఏం చేయమని చెబితే దానికి నేను దాసోహమంటాను. మీ ఇష్టమైన శిక్ష వేయండి. మీ ‘జనసేన’ చెప్పినట్టుగా నన్ను చంపేయండి.. నేను ప్రాణాలకు భయపడే వ్యక్తిని కాదు. ప్రజలకు నిస్వార్థంగా, నిజాయతీగా సేవ చేయాలని రాజకీయాల్లోకి వచ్చిన వాడిని కనుకే, ప్రజలు నన్ను ఆదరిస్తున్నారు.

కావాలనుకుంటే,  మీకు నా ఎన్నికల డిక్లరేషన్స్ పంపిస్తాను. ఓ కమిటీ వేయండి. నేను కానీ, మా అబ్బాయి గానీ ఫలానా వాళ్ల భూమి దగ్గరకు వెళ్లి బెదిరించామని ఎవరైనా ఫిర్యాదు చేసినట్టు నిరూపించండి. నేను, నా కొడుకు బెదిరిస్తూ.. రాజ్యమేలుతున్నామని పవన్ మాట్లాడటం కరెక్టు కాదు. రాజ్యమేలడం లేదు.. ప్రజలకు సేవ చేస్తున్నాం. అందుకే, ప్రజలు నన్ను ఆదరిస్తున్నారు..గౌరవిస్తున్నారు.

నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, నాకు పదవులు లేనప్పుడు కూడా ప్రజలు నన్ను గౌరవించారు. పవన్ కల్యాణ్ .. వాస్తవాలు తెలుసుకోకుండా తప్పుడు మాటలు మాట్లాడొద్దు’ అని పవన్ ని హెచ్చరించారు. చంద్రబాబుకు క్యారెక్టర్, చిత్తశుద్ధి, నిజాయతీ ఉన్నాయని, అటువంటి వ్యక్తిపైనా పవన్ కల్యాణ్ తన ఇష్టానుసారం వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Pawan Kalyan
Telugudesam mla bandaru
  • Loading...

More Telugu News