nagam: గన్ మెన్ల తొలగింపుపై.. నాగంకు అనుకూలంగా ఉత్తర్వులు వెలువరించిన హైకోర్టు
- భద్రతను పునరుద్ధరించాలంటూ మధ్యంతర ఉత్తర్వులు
- గన్ మెన్ల తొలగింపుపై వివరణ ఇవ్వాలంటూ ఆదేశాలు
- తదుపరి విచారణ సోమవారానికి వాయిదా
కాంగ్రెస్ నేత నాగం జనార్దనరెడ్డికి భద్రతను పునరుద్ధరించాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను వెలువరించింది. గన్ మెన్లను కేటాయించాలని ఆదేశించింది. వివరాల్లోకి వెళ్తే, తనకు గన్ మెన్లను తొలగించిన అంశంపై హైకోర్టులో నాగం పిటిషన్ వేశారు. కావాలనే తన భద్రతను రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించిందని... 1 ప్లస్ 1 భద్రతను పురరుద్ధరించేలా ఆదేశించాలని పిటిషన్ లో కోరారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో చోటు చేసుకున్న అవినీతిపై తాను హైకోర్టులో పిల్ వేశానని... ఈ నేపథ్యంలో, కాంట్రాక్టర్ల నుంచి తనకు ప్రాణహాని ఉందని చెప్పారు.
ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు నాగంకు అనుకూలంగా ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాదు, నాగంకు భద్రతను ఎందుకు తొలగించారో వివరణ ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.