Jagan: అఫిడవిట్‌పై కేంద్ర సర్కారుని పవన్ ఎందుకు నిలదీయట్లేదు: యనమల
- సుప్రీంకోర్టుకి కేంద్ర సర్కారు తప్పుడు సమాచారం ఇచ్చింది
- పోలవరం ప్రాజెక్టులో ఆర్‌అండ్‌ఆర్‌పై స్పష్టత ఇవ్వలేదు
- అఫిడవిట్ రాష్ట్రానికి వ్యతిరేకంగా ఉంది
- జగన్, పవన్ మాట్లాడకపోవడం బీజేపీతో వారిది లాలూచీ కాదా?
ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం అమలుపై సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్‌పై ఏపీ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ... కేంద్రం దాఖలు చేసిన అఫిడవిట్‌కు వ్యతిరేకంగా తాము కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేస్తామని చెప్పారు. కేంద్ర సర్కారు దాఖలు చేసిన అఫిడవిట్ సుప్రీంకోర్టును తప్పుదారి పట్టించేలా ఉందని అన్నారు.
ఉద్దేశపూర్వకంగానే కేంద్ర సర్కారు తప్పుడు సమాచారం ఇచ్చిందని, పోలవరం ప్రాజెక్టులో ఆర్‌అండ్‌ఆర్‌పై స్పష్టత ఇవ్వలేదని యనమల తెలిపారు. పునరావాసం ప్యాకేజీ నుంచి కేంద్రం తప్పించుకోవాలని చూస్తోందని, అసలు విభజన చట్టంలో పేర్కొన్న దానికి, అఫిడవిట్‌లో పెట్టినదానికి ఏమీ పొంతన లేదని అన్నారు. అఫిడవిట్ రాష్ట్రానికి వ్యతిరేకంగా ఉందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ కేంద్ర సర్కారుని ఎందుకు నిలదీయట్లేదని ప్రశ్నించారు. అఫిడవిట్‌పై ఆయనతో పాటు వైసీపీ అధినేత జగన్ మాట్లాడకపోవడం బీజేపీతో వారిది లాలూచీ కాదా? అని నిలదీశారు.