Chandrababu: ఇకపై ఎవరూ ఇలాంటి పనులకు పాల్పడవద్దు!: కన్నాపై చెప్పు విసిరిన ఘటనపై చంద్రబాబు
- ఇకపై ఎవరూ ఇలాంటి పనులకు పాల్పడవద్దు
- అభివృద్ధి పనులు జగన్, పవన్ లకు కనిపించడం లేదా?
- రాష్ట్రానికి ద్రోహం చేయాలనుకుంటే ఖబడ్దార్
ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణపై ఇటీవల కావలిలో ఓ వ్యక్తి చెప్పు విసిరిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. ఇలాంటి వాటికి తాను వ్యతిరేకమని... ఇకపై ఎవరూ ఇలాంటి పనులకు పాల్పడవద్దని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న నమ్మకద్రోహంపై తాము ధర్మపోరాటం చేస్తున్నామని ఆయన అన్నారు. కడపకు స్టీల్ ప్లాంట్ కూడా ఇవ్వడం లేదని మండిపడ్డారు. తాము కట్టే పన్నులను 15 సంవత్సరాలపాటు వాయిదా వేయాలని... అప్పుడు స్టీల్ ప్లాంటును తామే కట్టుకుంటామని చెప్పారు.
రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులు జగన్, పవన్ కల్యాణ్ లకు కనిపించడం లేదా? అని చంద్రబాబు ప్రశ్నించారు. రాష్ట్ర ప్రయోజనాలను వీరిద్దరూ తాకట్టు పెడుతున్నారని మండిపడ్డారు. చేతనైతే రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంతో పోరాడాలని, లేకపోతే తమ వెంట నడవాలని అన్నారు. రాష్ట్రానికి ద్రోహం చేయాలనుకుంటే మాత్రం... 'ఖబడ్దార్' అంటూ హెచ్చరించారు.