New Delhi: బురారీ మిస్టరీ కేసులో మరో ట్విస్ట్.. ఆత్మహత్యల వెనక 12వ వ్యక్తి?
- సామూహిక ఆత్మహత్యలకు ముందు వటవృక్ష పూజ
- ప్రధాన ద్వారం తెరిచే ఉంచి ఆత్మహత్య
- ఆ ద్వారం గుండా 12వ వ్యక్తి వెళ్లిపోయి ఉంటాడని అనుమానం
ఢిల్లీలోని బురారీ ప్రాంతంలో జరిగిన సామూహిక ఆత్మహత్యల కేసులో రోజుకో ట్విస్ట్ బయటపడుతోంది. ఈ మొత్తం మిస్టరీ వెనక 12వ వ్యక్తి హస్తం ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. దానికి కారణం ప్రధాన ద్వారం తెరిచి ఉండడం. భాటియా కుటుంబం ఆత్మహత్యకు ముందు ‘వటవృక్ష’ పూజ నిర్వహించారు. బయటి నుంచి వచ్చిన వ్యక్తే ఈ పూజను నిర్వహించి అదే ద్వారం గుండా బయటకు వెళ్లడం వల్లే అది తెరిచి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. మరోవైపు.. తెరిచి ఉంచిన ద్వారం గుండా అతీంద్రియ శక్తులు లోపలికి వస్తాయనే నమ్మకంతోనే వారా పని చేసి ఉండి ఉండవచ్చని కూడా భావిస్తున్నారు.
మరోవైపు భాటియా కుటుంబానికి ఇటువంటి పూజలు కొత్త కాదని ఇంట్లో లభించిన ఆధారాల ద్వారా తెలుస్తోంది. 2007లో నారాయణ్ దేవి భర్త మృతి చెందారు. ఆయన మరణాన్ని కుటుంబం జీర్ణించుకోలేకపోయింది. ముఖ్యంగా లలిత్ భాటియా మానసిక స్థితి పూర్తిగా దెబ్బతింది. తండ్రి ఫొటోతో మాట్లాడడం, ఆయన ఆదేశాలు ఇచ్చాడంటూ వాటిని ఓ పుస్తకంలో రాయడం చేస్తుండేవాడు. తండ్రి తన కలలో కనిపించాడని, మాట్లాడాడని, ఆయన ఆత్మ ఆవహించిందని చెబుతూ కుటుంబ సభ్యులను కూడా అదే దారిలో నడిపించాడు. వారికి కూడా తన రుగ్మతను అంటించాడు.
భాటియా ఇంట్లో దొరికిన పుస్తకాలను విశ్లేషిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. అంతిమ సమయంలో మన కోర్కెలు నెరవేరేటప్పుడు ఆకాశం బద్దలవుతుందని, భూమి కంపిస్తుందని, అయినా ఎవరూ భయపడవద్దని పుస్తకాల్లో రాసి ఉందని పోలీసులు వివరించారు. ఆ సమయంలో మంత్రం జపించాలని, తాను వచ్చి రక్షిస్తానని ఓ పుస్తకంలో రాసి ఉందని పేర్కొన్నారు. అంటే.. ఆత్మహత్యల నుంచి తమను ఎవరో రక్షిస్తారన్న నమ్మకంతో వారంతా ఉన్నట్టు తెలుస్తోందని అంటున్నారు. అంటే.. పైవాడు (తండ్రి) కాపాడతాడనే నమ్మకంతో వారంతా ఉన్నారా? అన్నది ఇప్పుడు పోలీసులను వేధిస్తున్న ప్రశ్న. భాటియా ఇంట్లో దొరికిన పుస్తకాలను మానసిక నిపుణులు విశ్లేషిస్తున్నారని పోలీసులు వివరించారు.