vangaveeti ranga: ఏపీలో ఏదైనా ప్రభుత్వ పథకానికి వంగవీటి రంగా పేరు పెట్టాలి: కాంగ్రెస్ నేత కొలనుకొండ

  • విజయవాడలో వంగవీటి రంగా 71వ జయంతి కార్యక్రమం
  • ప్రజల బాగు కోసం రంగా పరితపించారు 
  • రంగా స్మారకార్థం మెమోరియల్‌ ఏర్పాటు చేయాలి

ఏపీలో ఏదైనా ప్రభుత్వ పథకానికి వంగవీటి రంగా పేరు పెట్టాలని ఏపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి కొలనుకొండ శివాజీ డిమాండ్ చేశారు. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన దివంగత ఎమ్మెల్యే వంగవీటి మోహనరంగా 71వ జయంతి కార్యక్రమం ఈరోజు నిర్వహించారు. విజయవాడలోని గాంధీనగర్‌ లో ఉన్న 'గురు నివాస్‌' వద్ద ఈరోజు నిర్వహించిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ శ్రేణులు, కాపు నాయకులు, రంగా అభిమానులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాధా రంగా మిత్రమండలి గౌరవాధ్యక్షుడు చెన్నుపాటి శ్రీను హాజరయ్యారు. తొలుత, రంగా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం భారీ కేక్‌ను కట్‌ చేశారు. కొలనుకొండ శివాజీ మాట్లాడుతూ, ప్రజల బాగు కోసం నిరంతరం పరితపించిన వంగవీటి మోహనరంగా స్మారకార్థం స్థానిక కృష్ణలంకలో మెమోరియల్‌ ఏర్పాటు చేయాలని, ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోయేలా ఏదో ఒక ప్రభుత్వ పథకానికి రంగా పేరు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. కాపుల రిజర్వేషన్‌ కోసం ఉద్యమించిన ముద్రగడ పద్మనాభంకు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టిన వందలాది మంది కాపు సంఘాల కార్యకర్తలు, నాయకులపై పోలీస్‌ కేసులను బేషరతుగా ఎత్తివేయాలని కోరారు. ఇతర రాష్ట్రాలలో సైతం రిజర్వేషన్ల కోసం ఉద్యమించిన గుజ్జర్లు, రాజ్‌పుత్‌లపై కేసులు ఎత్తివేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు.  

అంతకుముందు, చెన్నుపాటి శ్రీను మాట్లాడుతూ, సూర్యచంద్రులు ఉన్నంత వరకూ ప్రజల హృదయాల్లో రంగా జీవించే ఉంటారని అన్నారు. రంగా మరణించి 30 ఏళ్లు గడుస్తున్నా కోస్తాంధ్ర అంతటా ఆయనకున్న ప్రజాదరణ చెక్కు చెదరలేదని, ఇప్పటికీ ఊరూవాడా రంగా జయంతులు, వర్థంతి కార్యక్రమాలు నిర్వహించుకోవడమే ఇందుకు నిదర్శనమని చెప్పారు. రంగా ఆశయాలను నేటి యువత స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. 

  • Loading...

More Telugu News