emirates airlines: మెనూ నుంచి 'హిందూ భోజనం'ను తొలగిస్తున్నట్టు ఎమిరేట్స్ ఎయిర్ లైన్స్ ప్రకటన
- ప్రయాణికుల అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాతే నిర్ణయం
- ప్రత్యామ్నాయంగా ఇతర శాకాహార వంటలు
- మాంసాహార వంటకాలు కూడా లభ్యం
దుబాయి కేంద్రంగా నడిచే ఎమిరేట్స్ ఎయిర్ లైన్స్ భారత్ కు ఎన్నో సర్వీసులు నడుపుతుండగా, ఇకపై తన విమానాల్లో హిందూ భోజనం అందుబాటులో ఉండదని ప్రకటించింది. తమ ఉత్పత్తులు, సర్వీసులపై క్రమానుగతంగా సమీక్ష చేస్తుంటామని పేర్కొంది. ఇది తమ సేవలను మెరుగుపరుచుకునేందుకు ఉపయోగపడుతుందని వివరించింది. విమానాల్లో అందించే ఆహారం, సేవలపై ప్రయాణికుల నుంచి అభిప్రాయాలు స్వీకరించిన తర్వాతే హిందూ భోజనాన్నిఎత్తేయాలని నిర్ణయించినట్టు ఎమిరేట్స్ ఎయిర్ లైన్స్ తెలిపింది. అయితే హిందూ ప్రయాణికులు ప్రత్యామ్నాయంగా శాకాహార, మాంసాహార వంటకాల నుంచి ఎంచుకోవచ్చని సూచించింది, శాకాహార జైన్ మీల్, ఇండియన్ వెజిటేరియన్ మీల్, కోషర్ మీల్ అందుబాటులో ఉన్నాయని తెలియజేసింది.