modi: నేను రాజాధిరాజును కాదు, దురహంకారిని కాదు.. మళ్లీ ప్రధాని నేనే!: మోదీ

  • తనపై ద్వేషమే విపక్షాలను కలుపుతోంది
  • మోదీని తప్పించడమే విపక్షాల ఏకైక లక్ష్యం
  • కాంగ్రెస్ ప్రాంతీయ పార్టీలా మారిపోయింది..  

కేవలం తనను తొలగించాలనే ఏకైక లక్ష్యంతో విపక్షాలు మహాకూటమి దిశగా అడుగులు వేస్తున్నాయని ప్రధాని మోదీ అన్నారు. విపక్షాలను కలుపుతున్నది కేవలం మోదీపై ద్వేషం మాత్రమేనని చెప్పారు. తాజాగా ప్రధాని ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలు మాట్లాడారు. ప్రతి పార్టీ దృష్టి అధికారంపైనే ఉందని... ప్రధాని పదవి, వ్యక్తిగత మనుగడ మాత్రమే వారికి కావాలని ఎద్దేవా చేశారు. ప్రధాని పదవిని చేపట్టేందుకు తాను సిద్ధంగా ఉన్నానని రాహుల్ గాంధీ అన్నారని... మమతా బెనర్జీకి కూడా ప్రధాని కావాలనే కోరిక ఉందని చెప్పారు. ప్రధాని పదవికి తమ అధినేత మాత్రమే అర్హుడు అని సమాజ్ వాదీ పార్టీ అంటుందని తెలిపారు.

కాంగ్రెస్ పార్టీ ఒక ప్రాంతీయ పార్టీలా మారిపోయిందని... ఆ పార్టీని ప్రజలు తిరస్కరించారని మోదీ అన్నారు. మహాకూటమిని ఏర్పాటు చేసే శక్తి కాంగ్రెస్ కు లేదని చెప్పారు. ఎన్డీయేలో విభేదాలు ఉన్నాయనేది కేవలం దుష్ప్రచారం మాత్రమేనని... 20 పార్టీలతో కూడిన ఎన్డీయేది ఒక సంతోష కుటుంబమని తెలిపారు. రానున్న ఎన్నికల్లో ఎన్డీయే ఘన విజయం సాధిస్తుందని... ప్రధాని పదవిని మళ్లీ తానే చేపడతానని ధీమా వ్యక్తం చేశారు.

తమ సుపరిపాలనకు, విపక్షాల గగ్గోలుకు మధ్యే రానున్న ఎన్నికలు జరగబోతున్నాయని మోదీ అన్నారు. తాను రాజాధిరాజును కానీ, దురహంకారిని కానీ కాదని చెప్పారు. తనపై ప్రజలు ఆదరాభిమానాలను కురిపిస్తున్నప్పుడు... వారిని కలవకుండా తాను ఉండలేనని అన్నారు. రోడ్లకు ఇరువైపులా చిన్నాపెద్దా తనకు అభివాదం చేస్తూ, చేతులు ఊపుతుంటారని... అందుకే కారు దిగి, వారిని కలుస్తానని చెప్పారు. 

  • Loading...

More Telugu News