Hyderabad: తాగి వాహనాలు నడిపే వారిపై జాలి అక్కర్లేదు.. కింది కోర్టు శిక్షను సమర్థించిన హైకోర్టు

  • డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడిన చంద్రశేఖర్
  • రూ.3 వేల జరిమానా, పది రోజులు జైలు శిక్ష విధించిన కింది కోర్టు
  • హైకోర్టుకు వెళ్తే అక్కడా చుక్కెదురే

మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై జాలి, దయ చూపించాల్సిన అవసరం లేదని హైకోర్టు స్పష్టం చేసింది. డ్రంకెన్ డ్రైవ్‌లో భాగంగా పట్టుబడిన ఓ బైకర్‌కు ట్రయల్ కోర్టు పది రోజుల జైలు శిక్ష విధించింది. దీనిని సవాలు చేస్తూ అతడు హైకోర్టును ఆశ్రయించాడు. కేసును విచారించిన జస్టిస్ పి.కేశవరావు ఆధ్వర్యంలోని హైకోర్టు కింది కోర్టు విధించిన శిక్షను సమర్థించింది. తాగి వాహనాలు నడిపే వారిపై జాలి చూపించాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది.

కేసు పూర్వాపరాల్లోకి వెళ్తే.. హైదరాబాదుకు చెందిన డి.చంద్రశేఖర్ బజాజ్ ఎలక్ట్రానిక్స్‌‌లో స్టోర్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. జూన్ 15న మద్యం తాగి బండిని డ్రైవ్ చేస్తున్న అతడిని పోలీసులు పట్టుకున్నారు. బ్రీత్ అనలైజర్ టెస్టులో అతడి శరీరంలో ఆల్కహాల్ శాతం ఉండాల్సిన దానికంటే ఏడు రెట్లు అధికంగా ఉన్నట్టు తేలింది. అతడిని కోర్టులో ప్రవేశపెట్టగా రూ.3వేల జరిమానాతోపాటు పది రోజుల జైలు శిక్ష విధించింది.

కింది కోర్టు శిక్షను హైకోర్టులో సవాలు చేసిన చంద్రశేఖర్‌కు అక్కడా ఎదురుదెబ్బ తగిలింది. శిక్ష విధిస్తే ఉద్యోగం కోల్పోవాల్సి వస్తుందన్న అతడి తరపు న్యాయవాది వాదనలను కోర్టు పరిగణనలోకి తీసుకోలేదు. తాగి డ్రైవ్ చేసే వారిపై జాలి చూపించాల్సిన అవసరం లేదని చెబుతూ కింది కోర్టు శిక్షను సమర్థిస్తూ తీర్పు చెప్పింది.

  • Loading...

More Telugu News