Roger Federer: భారత సంతతి అమ్మాయిని గుర్తించిన రోజర్... కోరిన కానుకనిచ్చిన వీడియో వైరల్!
- హెడ్ బ్యాండ్ కావాలని రాసున్న ప్లకార్డు పట్టుకున్న బాలిక
- బాలిక వద్ద ఆగి తీసిచ్చిన రోజర్ ఫెదరర్
- జీవితాంతం మరచిపోలేని కానుకన్న బాలిక తండ్రి
టెన్నిస్ ప్రపంచ రారాజు, ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న స్విస్ స్టార్ రోజర్ ఫెదరర్, లండన్ లో జరుగుతున్న వింబుల్డన్ పోటీల్లో పాల్గొంటున్న వేళ, ఓ భారత యువ అభిమాని కోరికను తీర్చి, ఆమెకు జీవితాంతం మరచిపోలేని అనుభవాన్ని మిగిల్చాడు. పక్కనే ఉన్న మిగతా ఫ్యాన్స్ ను మెస్మరైజ్ చేశాడు. ఈ లెజండ్, తన తొలి రౌండ్ లో దుసాన్ లాజోవిక్ ను 6-1, 6-3, 6-4 తేడాతో వరుస సెట్లలో ఓడించి, వెనుదిరుగుతున్న వేళ, భారత సంతతి అమ్మాయి ఒకరు "రోజర్ నీ హెడ్ బ్యాండ్ నాకు ఇవ్వవా... ప్లీజ్" అని రాసున్న ప్లకార్డు పట్టుకుని నిలుచుంది.
సెక్యూరిటీ గార్డులు అమ్మాయిని అడ్డుకోలేదుగానీ, ముందుకు రాకుండా నిలువరించారు. మ్యాచ్ ముగిసిన అనంతరం, ఇద్దరు ముగ్గురు ఫ్యాన్స్ కు ఆటోగ్రాఫ్ ఇచ్చిన తరువాత ఆ అమ్మాయి పట్టుకున్న పోస్టర్ ను గుర్తించాడు. ఆ పాప దగ్గర ఆగి, తన బ్యాగ్ తెరిచి తలకు కట్టుకునే బ్యాండ్ ను బయటకు తీసి ఇచ్చాడు. దీంతో సెంటర్ కోర్టులోని అభిమానులంతా తమ హర్షధ్వానాలు తెలియజేయగా, ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. వింబుల్డన్ అధికారిక ట్విట్టర్ ఖాతాలో "అడగండి... మీకు అందుతుంది" అన్న క్యాప్షన్ తో ఈ వీడియో పోస్ట్ అయింది.
ఆ పాప అమెరికాలో స్థిరపడిన అభిజీత్ జోషి కుమార్తె. తన బిడ్డ ఫెదరర్ కు చాలా పెద్ద అభిమానని, ఆమెకు మరువలేని బహుమతిని అందించిన ఫెదరర్ కు కృతజ్ఞతలని తన ట్విట్టర్ ఖాతాలో తెలిపాడు. ఈ ఘటనను ఆమె జీవితాంతం గుర్తుంచుకుంటుందని చెప్పాడు.