Thailand: మరో నాలుగు నెలల పాటు గుహలోనే థాయ్ ఆటగాళ్లు.. ఈలోగా ఈతలో శిక్షణ!
- లుయాంగ్ గుహలో చిక్కుకున్న 13 మంది
- విటమిన్లు, మినరల్స్ తో కూడిన ఆహారం అందజేత
- కనీసం నాలుగు నెలల పాటు వారంతా అక్కడే
థాయ్ లాండ్ యూత్ ఫుట్ బాల్ టీమ్, వారి కోచ్ లుయాంగ్ గుహ నుంచి ఇప్పుడప్పుడే బయటకు వచ్చే పరిస్థితులు లేవని థాయ్ సైన్యం స్పష్టం చేసింది. మొత్తం 13 మంది అక్కడ ఉండగా, గుహలో బురద, నీటి మట్టం పెరగడంతో పాటు, కొన్ని కిలోమీటర్ల లోపల ఇరుకైన ప్రాంతంలో వారు ఉన్నారని తెలిపారు. వణుకుతూ నీరసంతో ఉన్న వారికి ఇద్దరు వైద్యులు ధైర్యం చెబుతున్నారని రియర్ అడ్మిరల్ అపగోర్న్ యూకాంగ్యూ తెలిపారు. వీరికి అధిక విటమిన్లు, ఖనిజ లవణాలతో కూడి, సులభంగా జీర్ణమయ్యే ఆహారాన్ని, మాత్రలను అందించామని, ఏడుగురు గజ ఈతగాళ్లను వారితోనే ఉంచామని, అందరినీ సురక్షితంగా తీసుకు వస్తామని తెలిపారు.
కాగా, వీరంతా గుహ ద్వారం నుంచి నాలుగు కిలోమీటర్ల లోపల ఉన్నారని తెలుస్తోంది. నీటి మట్టానికి రెండు మీటర్ల ఎత్తున ఉన్న మట్టి దిబ్బపై వీరుండగా, బ్రిటీష్ నేవీ సీల్స్ వీరిని కనిపెట్టారు. వీరు బయటకు రావాలంటే, ఒక్కొక్కరూ కనీసం ఆరు గంటల పాటు ఈదాల్సివుంటుంది. నీరసంగా ఉన్న వారు ఈదలేరన్న నిర్ణయానికి వచ్చిన అధికారులు, వారు ప్రస్తుతం ఎక్కడున్నారో అక్కడే ఉంచుతున్నారు. నీటి మట్టం పెరగకుండా, గంటకు పది వేల లీటర్ల నీటిని తోడుతుండగా, మళ్లీ వర్షాలు పడవచ్చన్న ఆందోళన నెలకొని వుంది. వీరికి ముందు జాగ్రత్తగా ఈతలో ప్రావీణ్యం పొందేలా శిక్షణ ఇస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. ఇక పైనుంచి తొలచి వారిని బయటకు తెచ్చే అవకాశాలు ఉన్నాయా? అన్న విషయాన్నీ సైన్యం పరిశీలిస్తోంది. నిన్న వీరిని గుహలో కనుగొన్న సంగతి తెలిసిందే.