YSRCP: వైసీపీని వెంటాడదాం.. ఏపీ కాంగ్రెస్ నేతలకు రాహుల్ దిశానిర్దేశం!

  • ఏపీ కాంగ్రెస్ టార్గెట్‌గా వైసీపీ
  • బీజేపీ-వైసీపీ స్నేహాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచన
  • పార్టీ వీడిన నేతలను తిరిగి వెనక్కి తెచ్చుకునే వ్యూహం

వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలకు సిద్ధమవుతున్న కాంగ్రెస్ అందుకు తగ్గ వ్యూహాలు రచిస్తోంది. అటు కేంద్రంలో, ఇటు ఏపీలోనూ అధికారాన్ని చేజిక్కించుకోవాలని గట్టి పట్టుదలతో ఉంది. ఇందుకోసం ఇప్పటి నుంచే రంగంలోకి దిగింది. ఇక రాష్ట్రాన్ని విభజించి ఏపీలో కొట్టుకుపోయిన పార్టీని తిరిగి గాడిలో పెట్టేందుకు ఆ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇటీవల ఢిల్లీలో తనను కలిసిన పార్టీ నేతలకు  ఈ మేరకు దిశానిర్దేశం కూడా చేసినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో పార్టీకి పూర్వవైభవం రావాలంటే వైసీపీని లక్ష్యంగా చేసుకోవడమే మార్గమని చెప్పినట్టు తెలుస్తోంది.

పార్టీ బలోపేతం కావాలంటే తొలుత పార్టీలోని లోపాలను గుర్తించాలని రాహుల్ సూచించారు. ప్రతీదానికి అధికార పక్షాన్ని ఆడిపోసుకోవడం వల్ల లాభం లేదని తేల్చి చెప్పినట్టు తెలుస్తోంది. పాలక పక్షాన్ని దుమ్మెత్తి పోసి, ప్రతిపక్ష వైసీపీ గురించి అస్సలు మాట్లాడకపోవడం చాలా పెద్ద పొరపాటని రాహుల్ పేర్కొన్నారు. వీలు చిక్కినప్పుడల్లా ఆ పార్టీని కూడా విమర్శించాలని సూచించారు. అలాగే, వైఎస్ రాజశేఖరరెడ్డికి, జగన్ మధ్య ఉన్న తేడా గురించి కూడా ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలని రాష్ట్ర నేతలకు రాహుల్ ఆదేశించారు.  

తద్వారా కాంగ్రెస్ పార్టీకి దూరమైన నేతలను తిరిగి చెంతకు తీసుకురాగలుగుతామని వివరించారు. అలాగే, బీజేపీ-వైసీపీ మధ్య ఉన్న స్నేహాన్ని కూడా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడం ద్వారా లబ్ధి పొందవచ్చని రాహుల్ వివరించారు.

  • Loading...

More Telugu News