Andhra Pradesh: ఈ - పంట యాప్ రూపొందించాలని ఏపీ ఇంఛార్జి సీఎస్ ఆదేశాలు

- వ్యవసాయ అధికారులతో సమావేశం
- రెవెన్యూ శాఖ సహకారంతో అన్ని వివరాలు సేకరించాలి
- అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో యాప్ రూపొందించాలి: పునేఠ
అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఈ-పంట యాప్ ని రూపొందించమని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) అనీల్ చంద్ర పునేఠ సంబంధిత అధికారులను ఆదేశించారు. సచివాలయంలోని సీఎస్ సమావేశ మందిరంలో వ్యవసాయ అధికారులతో ఈరోజు ఆయన సమావేశమయ్యారు. ఈ-పంట మొబైల్ యాప్ అప్లికేషన్ ని అభివృద్ధి చేసిన విధానాన్ని సమీక్షించారు. ఈ సందర్భంగా పునేఠ మాట్లాడుతూ, రెవెన్యూ శాఖ సహకారంతో గ్రామ స్థాయిలో సాగు భూమి, సాగులో లేని భూమి, సర్వే నెంబర్, భూముల వివరాలు, మిశ్రమ పంటలు, పంటల ఫొటోలు, ఉద్యానవన పంటలతో సహా అన్ని పంటలకు సంబంధించిన వివరాలను అందులో పొందుపరచాలని, చార్ట్ లో ఉన్న అన్ని కాలమ్స్ పూర్తి చేయాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ అధికారులు మాట్లాడుతూ, జిల్లా, డివిజన్, మండల, గ్రామ స్థాయిలో సర్వే నెంబర్ తో సహా పంటల వివరాలు యాప్ లో పొందుపరుస్తున్నట్లు చెప్పారు. పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా పునేఠకు వివరించారు. భూములు, పంటల వివరాలు, సర్వే నెంబర్ తోపాటు పట్టాదారు పేరు మొదలైన వివరాలు ఇస్తున్నట్లు తెలిపారు. అందులో మొత్తం 31 కాలమ్స్ ఉన్నట్లు చెప్పారు. రాష్ట్రంలో 4 లక్షల ఎకరాలలో కూరగాయలు, 70 లక్షల ఎకరాల్లో ఉద్యానవన పంటలు పండిస్తున్నట్లు వివరించారు. గ్రామానికి, సర్వే నెంబర్ భూమికి ఉన్న దూరాన్ని, మార్గం మ్యాప్ ని కూడా చూపించే విధంగా ఈ యాప్ అప్లికేషన్ రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఆ యాప్ లో వివరాలు సమగ్రంగా ఉండే విధంగా అనిల్ చంద్ర పునేఠ కొన్ని సలహాలు ఇచ్చారు. పొలానికి నెంబర్ కూడా ఇవ్వాల్సిందిగా సూచించారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషనర్ డి.మురళీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నగరాల అభివృద్ధిపై సింగపూర్ బృందంతో చర్చలు
రాష్ట్రంలోని నగరాలను విద్య, వైద్య, ఆదాయ పరంగా అభివృద్ధి చేసే అంశాలపై అనిల్ చంద్ర పునేఠ సింగపూర్ బృందంతో ఈ రోజు చర్చలు జరిపారు. అమరావతి, విశాఖపట్నం, కాకినాడ, తిరుపతి తదితర నగరాలను అన్ని విధాల దేశంలోని ప్రధాన నగరాల సరసన చేరే విధంగా అభివృద్ధి చేయడానికి సహకరిస్తామని నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్, లీకాన్ ఏవ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ, ఆసియా కాంపిటేటివ్ నెస్ ఇన్ స్టిట్యూట్ కో డైరెక్టర్ అసోసియేట్ ప్రొఫెసర్ తాన్ ఖీ జియాప్ చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పని తీరుని ఆయన ప్రశంసించారు.
