ravi sastri: నా తండ్రితో కూడా కలిసి మందు తాగుతానని అధికారులకు చెప్పా!: రవిశాస్త్రి
- బాగా ఆడాలి.. ఆ తర్వాత పార్టీ చేసుకోవాలనేది నా సిద్ధాంతం
- ఒక రోజు బీర్ తాగుతుంటే ఇన్ ఛార్జ్ చూశాడు
- మందు ప్రభావం నా ఆటపై ఉండదని చెప్పా
తన కెరీర్ ప్రారంభంలో జరిగిన ఆసక్తికర విషయాన్ని టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి పంచుకున్నారు. బాగా ఆడాలి.. ఆ తర్వాత పార్టీ చేసుకోవాలనేది మొదటి నుంచి తన సిద్ధాంతమని చెప్పారు. అండర్-19కి ఆడే సమయంలో తాను బీర్ తాగుతుంటే, ఇన్ ఛార్జి చూశాడని... ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించాడని తెలిపారు. తన చేతిలో ఉన్న బీరు సీసా తీసుకున్నాడని, అప్పటికి సగం సీసా మాత్రమే ఖాళీ అయిందని... అయితే తాను ఏమాత్రం భయపడలేదని, అతన్ని పిలిచి మిగిలిన బీరును గ్లాసులో పోసుకుని, సీసా ఇచ్చి వెళ్లమన్నానని చెప్పారు.
ఆ మరుసటి రోజు తాను ఊహించిన విధంగానే తనకు సమన్లు అందాయని... అధికారుల వద్దకు వెళ్లి తాను ఒకటే చెప్పానని... 'నేను ఎంతో గౌరవించే నా తండ్రితో కలిసి కూడా మందు తాగుతా. మందు తాగిన ప్రభావం మైదానంలో కనిపిస్తే, నన్ను బయటకు పంపించేయండి' అని చెప్పానని తెలిపారు. బీర్ తాగాననే కారణంతో తనను బయటకు పంపడం సరైనది కాదని, ఇప్పటికిప్పుడు మైదానంలో క్రికెట్ ఆడమన్నా, ఆడుతానని చెప్పానని అన్నారు. ఆ వివాదం అంతటితో సమసిపోయిందని చెప్పారు.