governer: అందరూ హాయ్, బై అనే అంటున్నారు.. విదేశీ ధోరణులు మానండి: విద్యార్థులకు గవర్నర్ నరసింహన్ సూచన

  • నమస్కారంతో పలకరించుకునే రోజులు పోయాయి
  • మాతృ భాషను అందరూ నేర్చుకోవాలి
  • మాతృభాషలో మాట్లాడడానికి సిగ్గు పడకూడదు
  • అమెరికా వాళ్లు మంచిదని చెబితే మనం యోగా చేస్తున్నాం

పూర్వకాలంలో ఇంట్లోని పెద్ద వాళ్లు మాతృ భాషలోనే మాట్లాడడానికి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చేవారని, దానివల్ల కుటుంబంలోని అందరికి మాతృ భాషలో మాట్లాడడం అలవాటు అయ్యేదని, ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయిందని గవర్నర్‌ నరసింహన్‌ అన్నారు. అందరూ హాయ్, బై అని అంటున్నారని, నమస్కారంతో పలకరించుకునే రోజులు పోయాయని, విదేశీ ధోరణులు మానండని చెప్పారు.

హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో ఈరోజు జరిగిన తెలుగు విశ్వవిద్యాలయం 14వ స్నాతకోత్సవంలో పాల్గొన్న నరసింహన్‌ తన ప్రసంగాన్ని మొత్తం తెలుగులోనే ఇచ్చారు. మాతృ భాషను అందరూ నేర్చుకోవాలని, అలాగే మాతృబాషలో మాట్లాడడానికి సిగ్గు పడకూడదని చెప్పారు.  

కాగా, ఒక సామాన్యుడు మాన్యుడుగా మారడానికి విశ్వవిద్యాలయం దోహదం చేస్తుందని గవర్నర్ నరసింహన్ చెప్పారు. తెలుగు విశ్వవిద్యాలయం నుండి పట్టాలు పొందిన విద్యార్థులు, గ్రూపులుగా ఏర్పడి, గ్రామాలకు వెళ్లి, అక్కడి ప్రజలకు మన సాహిత్యం, సంస్కృతి, లలిత కళలు, వారసత్వ సంపద గురించి అవగాహన కల్పించాలని చెప్పారు. విద్యార్థులందరికి సామాజిక సేవ చేయాల్సిన భాధ్యత ఉందని చెప్పారు.

స్వచ్ఛత అభియాన్ కింద కాలనీలను దత్తత తీసుకుని పరిశుభ్రత గురించి అవగాహన కలిగించాలని నరసింహన్ సూచించారు. అమెరికా వాళ్లు మంచిదని చెబితే మనం యోగా చేస్తున్నామని, అమెరికా వాళ్లు చెబితే ప్రాణాయామం ఆరోగ్యానికి మంచిదని మనం తెలుసుకుంటున్నామని, మన సంస్కృతి గురించి బయటివారి ద్వారా తెలుసుకుని పాటించే దానికంటే, మన సంస్కృతి గురించి మనమే తెలుసుకుని ఆచరిస్తే మంచిదని అన్నారు.  

  • Loading...

More Telugu News