Jammu And Kashmir: జమ్మూ కశ్మీర్లో ఫలిస్తున్న బీజేపీ పాచిక... పీడీపీలో చీలిక!

  • మెహబూబా ముఫ్తీపై సొంత పార్టీ నేతల విమర్శలు
  • ఓ మంత్రి విమర్శలను సమర్థించిన ఎమ్మెల్యేలు
  • పీడీపీలో చీలిక ఖాయమంటున్న రాజకీయ విశ్లేషకులు

జమ్మూ కశ్మీర్ లో పీడీపీ - బీజేపీ మధ్య ఉన్న బంధం తెగిపోయి, ప్రభుత్వం పడిపోయిన తరువాత, తిరిగి అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ పన్నిన ఎత్తుగడలు ఫలించేలా కనిపిస్తున్నాయి. పీడీపీలో చీలిక రావచ్చని గత కొన్ని రోజులుగా వస్తున్న ఊహాగానాలకు బలం చేకూరుతోంది. పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీలో కనీసం ముగ్గురు ప్రజా ప్రతినిధులు మెహబూబా ముఫ్తీకి వ్యతిరేకంగా ఉన్నారని సమాచారం. ప్రభుత్వం పడిపోవడానికి ఆమె విధానాలే కారణమని వీరు విమర్శిస్తున్నారు. పీడీపీ, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీలకు ప్రత్యామ్నాయంగా ఓ కొత్త పార్టీని ప్రారంభించేందుకు వీరు సమాలోచనలు చేస్తున్నట్టు తెలుస్తోంది.

కాగా, ప్రస్తుతం 89 మంది ఎమ్మెల్యేలున్న జమ్మూ కశ్మీర్ అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 45 మంది ఎమ్మెల్యేల బలం ఉండాలి. బీజేపీకి 25 మంది, పీడీపీకి 28 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. పీడీపీ నుంచి కొందరు బయటకు రానున్నట్టు, అలాగే కాంగ్రెస్ నుంచి కూడా కొందరు రానున్నట్టు వార్తలొస్తున్నాయి. ప్రభుత్వ ఏర్పాటు విషయంలో వీరంతా బీజేపీకి మద్దతు పలుకుతారని తెలుస్తోంది.

నిన్న మాజీ మంత్రి ఇమ్రాన్ అన్సారీ మాట్లాడుతూ, ప్రభుత్వ పతనానికి మెహబూబానే కారణమని ఆరోపించగా, ఆపై గంటల వ్యవధిలో ఎమ్మెల్యే మొహమ్మద్ అబ్బాస్ వానీ మాట్లాడుతూ, అన్సారీ చెప్పింది అక్షర సత్యమని వ్యాఖ్యానించారు. ఆపై కాసేపటికే అన్సారీ బంధువైన మరో ఎమ్మెల్యే అబీద్ అన్సారీ మీడియా ముందుకు వచ్చి అవే మాటలు అన్నారు. ఇక వీరంతా కలసి తమ మద్దతుదారులతో సమాలోచనలు జరుపుతున్నట్టు తెలుస్తుండగా, పీడీపీలో చీలిక తప్పకపోవచ్చని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News