PNB: ఇక ఏ క్షణమైనా అరెస్ట్ కానున్న నీరవ్ మోదీ!
- పీఎన్బీకి రూ. 13 వేల కోట్లు ఎగ్గొట్టిన నీరవ్ మోదీ
- రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసిన ఇంటర్ పోల్
- అరెస్టయితే, ఇండియాకు తీసుకువచ్చే అవకాశాలు
ప్రభుత్వ రంగ పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి తీసుకున్న వేల కోట్ల రుణాలను ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన నీరవ్ మోదీకి ఇంటర్ పోల్ షాక్ ఇచ్చింది. ఆయనపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసేందుకు ఇంతవరకూ మీనమేషాలు లెక్కించిన ఇంటర్ పోల్, ఇప్పుడు ముందడుగు వేసింది.
భారత అధికారులు పదే పదే విజ్ఞప్తులు చేసిన తరువాత నీరవ్ మోదీపై రెడ్ కార్నర్ నోటీసు జారీ కాగా, ఇకపై ఏ క్షణమైనా ఆయన్ను అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఎక్కడ అరెస్టయినా, అతనిని తమకు అప్పగించాలని ఇండియా కోరవచ్చు. అయితే, భారత్ తో సత్సంబంధాలు, నేరస్తుల అప్పగింత ఒప్పందాలు ఉన్న దేశాల్లో నీరవ్ అరెస్ట్ అయితే, సులువుగా ఇండియాకు రప్పించవచ్చు.నీరవ్ పై జారీ చేసిన నోటీసులను తన అధికార వెబ్ సైట్ లో పెట్టిన ఇంటర్ పోల్, అతని పేరును నీరవ్ మోదీ దీపక్ గా పేర్కొంది. అతని వయసు 47 సంవత్సరాలని, ముంబైవాసని, ఇంగ్లీష్, హిందీ, గుజరాతీ భాషలు వచ్చని తెలిపింది. నలుపురంగు జుట్టు, కళ్లు కలిగివుంటాడని, మనీ లాండరింగ్ కేసులో నిందితుడని తెలిపింది.
కాగా, పంజాబ్ నేషనల్ బ్యాంకులో రూ. 13 వేల కోట్ల కుంభకోణానికి నీరవ్ తెరలేపిన సంగతి తెలిసిందే. బ్యాంకు నుంచి రుణాల పేరిట తీసుకున్న డబ్బును ఆయన విదేశాలకు తరలించాడు. మరికొన్ని రోజుల్లో కేసు బయటకు వస్తుందనగా, దేశం వీడి పారిపోయాడు. అతను ఎక్కడ తలదాచుకున్నాడన్న విషయమై అధికారిక సమాచారం ఇంతవరకూ లేదు.