Afghanisthan: నెత్తురోడిన జలాలాబాద్... ఆత్మాహుతి దాడిలో 19 మంది సిక్కుల మృతి!
- నంగహార్ ప్రావిన్స్ లో ఘటన
- అధ్యక్షుడిని కలిసేందుకు వెళుతున్న సిక్కులు
- దాడిలో పార్లమెంట్ ఎన్నికలకు పోటీ పడుతున్న అత్వార్ సింగ్ మృతి
- ఖండించిన భారత ఎంబసీ
ఆఫ్గనిస్థాన్ లోని తూర్పు ప్రాంత నగరం జలాలాబాద్ రక్తమోడింది. ఇక్కడి సిక్కు మైనారిటీ ప్రజలే లక్ష్యంగా ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడటంతో 19 మంది మరణించారు. వీరంతా నంగర్హార్ ప్రావిన్స్ ను సందర్శించనున్న అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీని కలిసి తమ బాధలు చెప్పుకునేందుకు ఓ వాహనంలో వెళుతుండగా, ఈ దాడి జరిగింది.
అక్టోబరులో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్న అత్వార్ సింగ్ ఖల్సా అనే వ్యక్తి కూడా మరణించిన వారిలో ఉన్నారు. ఈ దాడికి పాల్పడింది ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులని తెలుస్తోంది. ఈ దాడి జరిగిన సమయంలో ఘనీ ఆ ప్రాంతంలో లేరు. రెండు రోజుల పర్యటన నిమిత్తం నంగర్హార్ ప్రావిన్స్ కు వచ్చిన ఆయన ఓ ఆసుపత్రిని ప్రారంభించే కార్యక్రమంలో ఉన్న వేళ ఈ ఘటన జరిగింది. కాబూల్ లోని భారత ఎంబసీ ఈ దాడిని ఖండించింది. ఇది పిరికిపందల చర్యని అభివర్ణించింది.