India: దడ పుట్టిస్తున్న రూపాయి... రూ. 48 వేల కోట్లు వెనక్కు తీసుకున్న విదేశీ ఇన్వెస్టర్లు

  • దారుణంగా పతనమవుతున్న రూపాయి విలువ
  • ఆరు నెలల కాలంలో రూ. 48 వేల కోట్ల పెట్టుబడులు వెనక్కు
  • 2008 తరువాత తొలిసారి ఈ పరిస్థితి

డాలర్ తో మారకపు విలువను రూపాయి దారుణంగా కోల్పోతున్న వేళ, విదేశీ మదుపరులు ఇండియాలో పెట్టిన తమ పెట్టుబడులను వెనక్కు తీసేసుకుంటున్నారు. గడచిన ఆరు నెలల కాలంలో క్యాపిటల్ మార్కెట్ల నుంచి సుమారు రూ. 48 వేల కోట్ల ఇన్వెస్ట్ మెంట్ ను ఎఫ్పీఐ (ఫారిన్ పోర్ట్ పోలియో ఇన్వెస్టర్స్) వెనక్కు తీసుకున్నారని గణాంకాలు చెబుతున్నాయి. గడచిన పదేళ్ల కాలంలో ఎఫ్పీఐ పెట్టుబడులు ఇంత భారీగా వెనక్కు వెళ్లడం ఇదే తొలిసారి కావడం గమనార్హం

ముడి చమురు ధరలు పెరుగుతూ ఉండటం, రూపాయి పతనానికి తోడు వివిధ దేశాల మధ్య జరుగుతున్న ట్రేడ్ వార్ ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను హరిస్తోందని నిపుణులు వ్యాఖ్యానించారు. జనవరి - జూన్ మధ్యకాలంలో డెట్‌ మార్కెట్ల నుంచి రూ. 41,433 కోట్లు, ఈక్విటీ మార్కెట్ల నుంచి రూ. 6,430 కోట్లు, వెరసి మొత్తం రూ.47,836 కోట్లు ఇండియాను దాటినట్టు డిపాజిటరీ గణాంకాలు తెలుపుతున్నాయి. ప్రపంచాన్ని గడగడలాడించిన ఆర్థికమాంద్యం ప్రవేశించిన 2008లో ఎఫ్పీఐ లు రూ. 24,758 కోట్లను వెనక్కు తీసుకోగా, ఇప్పుడు అంతకు మించి పట్టుకుపోయారు.

ముఖ్యంగా ఏప్రిల్ నుంచి విదేశీ ఇన్వెస్టర్లు ఇండియాకు దూరమయ్యారని గణాంకాలు చెబుతున్నాయి. జనవరిలో రూ. 22 వేల కోట్లకు పైగా పెట్టుబడిని వెనక్కు తీసుకున్న ఇన్వెస్టర్లు ఆపై ఫిబ్రవరిలో రూ. 11 వేల కోట్లకు పైగా మళ్లించారు. మార్చి నెల కాస్తంత సానుకూలంగా ఉండటంతో రూ. 2,662 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఆపై ఏప్రిల్ నుంచి ఇన్వెస్ట్ మెంట్లు వెనక్కు వెళుతూనే ఉన్నాయి. పరిస్థితులను గమనిస్తుంటే, ఇండియాపై ఎఫ్పీఐలు సానుకూలంగా ఉన్నట్టు కనిపించడం లేదని, స్టాక్ మార్కెట్లను క్రూడాయిల్, రూపాయి శాసిస్తున్నాయని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

  • Loading...

More Telugu News