mekapati: మోదీ గ్రాఫ్ తగ్గిందనే భావనతోనే టీడీపీ బయటకు వచ్చింది.. మేము బీజేపీతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదు: మేకపాటి
- నాలుగేళ్లు కాపురం చేసిన బీజేపీ, టీడీపీలు.. ఇప్పుడు నాటకాలాడుతున్నాయి
- బీజేపీతో జగన్ స్నేహం చేస్తున్నారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు
- ఏపీ ప్రయోజనాల కోసమే మేము రాజీనామాలు చేశాం
రానున్న ఎన్నికల్లో బీజేపీతో పాటు, మరే ఇతర పార్టీతోనూ వైసీపీ పొత్తు పెట్టుకోదని ఆ పార్టీ మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి స్పష్టం చేశారు. బీజేపీతో నాలుగేళ్లు కలిసున్న ముఖ్యమంత్రి చంద్రబాబు సాధించింది ఏమీ లేదని విమర్శించారు. ఎన్డీయే నుంచి బయటకు వచ్చి ప్రధాని మోదీపై నిందలు వేస్తున్నారని అన్నారు. మోదీ గ్రాఫ్ తగ్గుతోందనే భావనతోనే ఎన్టీయేకు చంద్రబాబు గుడ్ బై చెప్పారని తెలిపారు. బీజేపీతో తమ అధినేత జగన్ స్నేహం చేస్తున్నారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అనంతపురంలో రేపు వైసీపీ 'వంచన గర్జన దీక్ష'ను నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా పదవులకు రాజీనామా చేసిన ఎంపీలతో కలసి అనంతపురంలో మీడియాతో మాట్లాడుతూ మేకపాటి ఈ వ్యాఖ్యలు చేశారు.
దళిత తేజం పేరుతో దళితులను ఏదో ఉద్ధరిస్తానని చంద్రబాబు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని మేకపాటి ఎద్దేవా చేశారు. 600లకు పైగా ఇచ్చిన చంద్రబాబు హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు ప్రజావ్యతిరేకతను ఎదుర్కొంటారని చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే తాము ఎంపీ పదవులకు రాజీనామాలు చేశామని తెలిపారు. ముందస్తు ఎన్నికలు వస్తాయో, రావో అనేది తనకు తెలియదని అన్నారు. టీడీపీ, బీజేపీలు నాలుగేళ్లు కాపురం చేసి, ఇప్పుడు నాటకాలు ఆడుతున్నాయని దుయ్యబట్టారు.