gst: నేటితో జీఎస్టీకి ఏడాది... ఒకే పన్ను ప్రయోజనాలపై ప్రధాని ట్వీట్
- దేశ ప్రజలకు ప్రధాని శుభాకాంక్షలు
- జీఎస్టీతో ఆర్థిక వ్యవస్థలో మార్పులు
- సహకార, సమాఖ్య స్ఫూర్తికి చక్కని ఉదాహరణ
దేశవ్యాప్తంగా వివిధ పన్నుల స్థానంలో ఒకే పన్ను చట్టంగా అమల్లోకి వచ్చిన జీఎస్టీ నేటితో ఏడాది కాలాన్ని పూర్తి చేసుకుంది. 2017 జూలై 1 నుంచి కేంద్ర సర్కారు దీన్ని అమల్లోకి తీసుకొచ్చింది. జీఎస్టీ ప్రయోజనాలు, దేశ ముఖచిత్రాన్ని ఏ విధంగా మార్చనుందీ తెలియజేసే కార్యక్రమాలు దేశవ్యాప్తంగా జరగనున్నాయి. వీటిలో కేంద్ర మంత్రులు పాల్గొననున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ దీనిపై ఈ రోజు ఉదయమే ట్వీట్ చేశారు. జీఎస్టీ ఏడాది కాలం పూర్తి చేసుకోవడంపై దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
‘‘జీఎస్టీ వృద్ధిని ప్రోత్సహించింది. పన్నుల్లో సులభత్వాన్ని, పారదర్శకతను తీసుకొచ్చింది. ఆర్థిక అంశాలను వ్యవస్థీకృతం చేసేందుకు. ఉత్పత్తిని పెంచేందుకు, వ్యాపారం మరింత సులభతర నిర్వహణకు సాయపడనుంది. సహకారాత్మక సమాఖ్య వ్యవస్థకు, టీమ్ ఇండియా స్ఫూర్తికి ఇదో అద్భుతమైన ఉదాహరణ. దేశ ఆర్థిక వ్యవస్థలో సానుకూల మార్పులను తీసుకొచ్చింది’’ అని ప్రధాని పేర్కొన్నారు.