Uttar Pradesh: మరో వివాదంలో యోగి సర్కారు... లక్నో మసీదు ముందు లక్ష్మణుడి విగ్రహ ప్రతిష్ఠకు సన్నాహాలు!
- చారిత్రాత్మక తీలేవాలీ మసీదు ఎదుట లక్ష్మణుడి భారీ విగ్రహం
- ఏర్పాటుకు అనుమతులు కోరిన ఇద్దరు ఎమ్మెల్యేలు
- మండిపడుతున్న ముస్లిం సంఘాలు
ఉత్తరప్రదేశ్ లోని యోగి సర్కారు మరో వివాదంలో చిక్కుకుంది. లక్నోలోని చారిత్రాత్మక తీలేవాలీ మసీదు ఎదుట శ్రీరాముడి సోదరుడు లక్ష్మణుడి భారీ విగ్రహాన్ని ప్రతిష్ఠించాలన్న బీజేపీ ఎమ్మెల్యేల ప్రతిపాదనే దీనికి కారణం. ఈ మేరకు బీజేపీ ఎమ్మెల్యే రామకృష్ణ యాదవ్, రజనీష్ గుప్తాలు లక్నో నగర్ నిగమ్ కు ప్రతిపాదనలు పంపారు. ప్రజల ఆకాంక్షల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని చెబుతూ, అసెంబ్లీ ముందుకు తమ ఆలోచనలు తెచ్చారు.
ఇక బీజేపీ ఎమ్మెల్యేల నిర్ణయంపై ముస్లిం సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. లక్ష్మణుడి విగ్రహం పెడితే, ఇక్కడి ప్రజల్లో ఆందోళన పెరుగుతుందని తీలేవాలీ మసీద్ ఇమామ్ మౌలానా ఫజల్ మానన్ వ్యాఖ్యానించారు. తాము ఏ విగ్రహం ముందు కూడా నమాజ్ చేయబోమని, ఇస్లాంలో విగ్రహారాధన లేదని ఆయన గుర్తు చేశారు. ఈ విగ్రహ ఏర్పాటుతో తమకు పెద్ద సమస్య వస్తుందని, శాంతి భద్రతల సమస్య కూడా ఏర్పడవచ్చని అన్నారు. దీనికి అనుమతి ఇవ్వద్దని ప్రభుత్వానికి సూచిస్తున్నట్టు తెలిపారు.
అయితే, ఈ విషయంలో ముస్లిం సంఘాలు కావాలనే వివాదాస్పదం చేస్తున్నాయని రామకృష్ణ యాదవ్ ఆరోపించారు. లక్ష్మణుడి పేరు మీదనే లక్నో ఏర్పడిందని, నగరం పేరును లక్ష్మణపురిగా మార్చాలని కూడా చాలా ఏళ్లుగా డిమాండుందని ఆయన గుర్తు చేశారు. అనుమతులు రాగానే విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ఆయన స్పష్టం చేశారు.