Hyderabad: ఎన్నిసార్లు టెస్ట్ చేస్తారు?... డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలలో యువతి హల్ చల్.. పోలీసుల అవాక్కు!

  • గత రాత్రి పలు ప్రాంతాల్లో డ్రంకెన్ డ్రైవ్
  • తనను ఐదుసార్లు తనిఖీ చేశారన్న యువతి
  • ఎన్ని చోట్ల తనిఖీలు పెడతారంటూ హల్ చల్

మందు తాగి రోడ్లపై వాహనాలను నడుపుకుంటూ వచ్చేవారిని నిరోధించేందుకు పోలీసులు చేస్తున్న ప్రయత్నాలు మందుతాగకుండా వాహనాలు నడిపే వారికి ఎంత చికాకును తెప్పిస్తాయో తెలియజేస్తుందీ ఘటన. గత రాత్రి హైదరాబాద్ లోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ పరిధిలోని పలు ప్రాంతాల్లో డ్రంకెన్ డ్రైవ్ ను పకడ్బందీగా నిర్వహించిన పోలీసులు, పలువురు మందుబాబులపై కేసులు పెట్టారు.

ఈ క్రమంలో జూబ్లీహిల్స్ డైమండ్ హౌస్ వద్ద నిర్వహించిన తనిఖీల్లో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. 'టీఎస్ 09 ఈయూ 9450' నంబర్ గల హ్యుందాయ్ క్రెటా కారులో వచ్చిన ఓ యువతి, పక్క వాహనాలను తనిఖీలు చేస్తున్న వేళ, ఓ హోండా సిటీ కారును ఢీకొట్టి వేగంగా ముందుకు వెళ్లిపోయింది. పోలీసులు అలర్ట్ అయ్యేలోపే ముందుకెళ్లిన ఆ యువతి, ట్రాఫిక్ జామ్ కారణంగా దొరికిపోయింది. ఆమె మందు తాగి ఉంటుందన్న అనుమానంతో బ్రీత్ అనలైజర్ తనిఖీ నిర్వహించగా, ఆల్కహాల్ శాతం 'సున్నా' వచ్చింది.

దీంతో అవాక్కైన పోలీసులు, ఎందుకు వేగంగా ముందుకు వచ్చావని ప్రశ్నిస్తే, తనను ఇప్పటికే ఐదుసార్లు తనిఖీ చేశారని, పక్కన వెళుతున్న వాహనాలను తనిఖీ చేయకుండా, తన కారును మాత్రం ఆపుతున్నారని రెచ్చిపోయింది. ఎన్నిచోట్ల తనిఖీలు చేస్తారని ప్రశ్నించింది. పోలీసులకు పౌరులు సహకరించాల్సిందేనని వ్యాఖ్యానించిన ఓ అధికారి, ప్రజల మేలు కోసమే తాము పనిచేస్తున్నామని సదరు యువతికి క్లాస్ తీసుకున్నారు. ఆమెపై ర్యాష్ డ్రైవింగ్ కింద కేసు పెట్టిన పోలీసులు, కారును సీజ్ చేశారు.

  • Loading...

More Telugu News