Aadhar: పుట్టిన వెంటనే ఆధార్... విజయవాడలో అమలు!
- కొన్ని ఆసుపత్రుల్లో ప్రయోగాత్మకంగా అమలు
- వేలిముద్రల అవసరం లేదు
- ఆధార్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ వేణుగోపాల్ రెడ్డి
బిడ్డ పుట్టిన రోజే ఆధార్ కార్డును అందించే విధానాన్ని విజయవాడలోని కొన్ని ఆసుపత్రుల్లో ప్రయోగాత్మకంగా అమలు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ విషయాన్ని ఆధార్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ జి.వేణుగోపాల్ రెడ్డి వెల్లడించారు. రెండు నెలల్లోనే గుర్తించిన ఆసుపత్రుల్లో ఈ సౌకర్యాన్ని ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. పుట్టిన బిడ్డల వేలిముద్రలతో అవసరం ఉండదని, వారి తల్లిదండ్రుల ఆధార్ సంఖ్యను నమోదు చేసుకుని, ఆధార్ కార్డును ఇస్తామని, బిడ్డకు ఐదేళ్లు వచ్చిన తరువాత వేలిముద్రలు ఇస్తే సరిపోతుందని తెలిపారు.
గతంలో ఈ విధానం అందుబాటులో లేదని, విజయవాడలో పరిశీలన అనంతరం రెండు తెలుగు రాష్ట్రాల్లో అమలు చేస్తామని తెలిపారు. తెలంగాణలో ఐదేళ్లలోపు చిన్నారులు 28,83,939 మంది ఉండగా, 18,66,311 మందికి, ఆంధ్రప్రదేశ్లో 37,70,250 మంది చిన్నారులకుగాను 25,17,082 మందికి ఆధార్ కేటాయించినట్టు తెలియజేశారు.