jenasena: వచ్చే ఎన్నికల్లో ఏపీలో త్రిముఖ పోటీ ఉంటుంది: సీపీఎం మధు
- టీడీపీ పాలనపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారు
- పూర్తి స్థాయి ప్రతిపక్ష పాత్రను పోషించడంలో వైసీపీ విఫలమైంది
- ‘జనసేన’కు పట్టం కట్టాలని ప్రజలు భావిస్తున్నారు
వచ్చే ఎన్నికల్లో ఏపీలో త్రిముఖ పోటీ ఉంటుందని, జనసేన, వైసీపీ, టీడీపీ వరుస స్థానాల్లో ఉంటాయని సీపీఎం మధు అభిప్రాయపడ్డారు. తిరుపతిలో ఈరోజు ఆయన విలేకరులతో మాట్లాడుతూ, జనసేన మొదటి స్థానంలో, వైసీపీ రెండో స్థానంలో, టీడీపీ మూడో స్థానంలో ఉంటాయని జోస్యం చెప్పారు.
టీడీపీ పాలనపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారని, పూర్తి స్థాయి ప్రతిపక్ష పాత్రను పోషించడంలో వైసీపీ విఫలమైందని, అందుకే, ఈ రెండు పార్టీలకు ప్రత్యామ్నాయంగా జనసేన పార్టీకి పట్టం కట్టాలని ప్రజలు భావిస్తున్నారని అన్నారు. ఉక్కు పరిశ్రమ కోసం టీడీపీ నేతల దీక్షను స్వాగతిస్తున్నామని, కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. ఉక్కు పరిశ్రమ సాధనకై త్వరలో ఏపీ బంద్ కు పిలుపు నిస్తామని చెప్పారు. రాష్ట్రంలో నష్టపోయిన మామిడి రైతులు, పాల ఉత్పత్తి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రైతులను ప్రభుత్వం ఆదుకోకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు.