CM Ramesh: లక్షల కుటుంబాల్లో దీపం వెలిగేందుకు నా దీపం ఆరిపోయినా ఫర్వాలేదు!: సీఎం రమేష్
- నా ఆరోగ్య పరిస్థితి బాగా లేదు
- చట్టంలో ఉన్నది సాధించుకోకుంటే చట్ట సభకు వెళ్లి లాభమేంటి?
- ఉక్కు పరిశ్రమ కోసం వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు
కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ కోసం టీడీపీ నేత సీఎం రమేష్ పది రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘నా ఆరోగ్య పరిస్థితి బాగా లేదు. లక్షల కుటుంబాల్లో దీపం వెలగడానికి నా దీపం ఆరిపోయినా ఫర్వాలేదు. చట్టంలో ఉన్నది సాధించుకోకుంటే చట్ట సభకు వెళ్లి లాభమేంటి? ఉక్కు పరిశ్రమ విషయమై కేంద్ర మంత్రి బీరేంద్ర సింగ్ తో ఎన్నోసార్లు చర్చించా. ప్రధాని మోదీ నుంచి అనుమతి రావాలని ఆయన చెప్పారు.
గాలి జనార్దన్ రెడ్డి రంగంలోకి రావడం చూస్తుంటే ఇదంతా బీజేపీ, వైసీపీ కుట్రే అనిపిస్తోంది. ఉక్కు పరిశ్రమ కోసం వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు’ అని చెప్పారు. కాగా, సీఎం రమేష్ కు ఈరోజు ఉదయం రిమ్స్ వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించారు. రమేశ్ ఆరోగ్యం రానురానూ క్షీణిస్తోందని, తక్షణ వైద్యసాయం అవసరమని సూచించారు.