Hyderabad: కాంగ్రెస్ కు షాకిస్తూ... టీఆర్ఎస్ లోకి వెళ్లనున్న ముఖేష్ గౌడ్!
- 15 ఏళ్లు ఎమ్మెల్యేగా, ఏడేళ్లు మంత్రిగా పనిచేసిన ముఖేష్ గౌడ్
- పుట్టిన రోజునాడు కీలక నిర్ణయాన్ని వెల్లడించే అవకాశం
- టీఆర్ఎస్ లో చేరితే కాంగ్రెస్ కు గట్టి ఎదురుదెబ్బే!
హైదరాబాద్ పరిధిలోని గోషామహల్ నియోజకవర్గపు కాంగ్రెస్ సీనియర్ నేత, 15 సంవత్సరాలు ఎమ్మెల్యేగా, ఏడేళ్లు మంత్రిగా పనిచేసిన ముఖేష్ గౌడ్ టీఆర్ఎస్ లో చేరేందుకు నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఓ బలమైన మాస్ లీడర్ గా పేరు తెచ్చుకున్న ఆయన్ను, టీఆర్ఎస్ లో చేర్చుకునేందుకు గత ఆరేడు నెలలుగా టీఆర్ఎస్ లోని ఓ వర్గం ప్రయత్నించి సఫలమైందని సమాచారం.
త్వరలో జరిగే తన పుట్టిన రోజున రాజకీయ భవిష్యత్తుపై ఆయన కీలక నిర్ణయాన్ని వెలువరించనున్నారని, ఇప్పటికే ప్రధాన అనుచరులు, కార్యకర్తలతో ఆయన చర్చించారని తెలుస్తోంది. జూలై 1వ తేదీన ఆయన పుట్టిన రోజు ఉండగా, గోషామహల్ పరిధిలో భారీ ఎత్తున కటౌట్ లు, ప్లెక్సీలు ఏర్పాటు చేసి, వేడుకలను వైభవంగా జరిపేందుకు ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి.
టీఆర్ఎస్ లోకి చేరాలని అనుకుంటున్నట్టు ముఖేష్ గౌడ్ ఇంతవరకూ ఎక్కడా అధికారిక ప్రకటన చేయనప్పటికీ, ఇటీవల మరో కీలక నేత దానం నాగేందర్ టీఆర్ఎస్ లో చేరిన నేపథ్యంలో, ముఖేష్ కూడా అదే దిశగా అడుగులు వేస్తారని ప్రచారం జరుగుతోంది. అతి త్వరలోనే నియోజకవర్గంలో పాదయాత్రలు చేసి, డివిజన్లలోని ప్రజా సమస్యలను తెలుసుకుంటానని ఇటీవల ముఖేష్ గౌడ్ తెలిపారు. ప్రస్తుతం ఆయన ఎంజే మార్కెట్ లోని తన కార్యాలయాన్ని పునః ప్రారంభించి, కార్యకర్తలతో వరుస సమావేశాలు నిర్వహిస్తూ ఉండటంతో సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. ముఖేష్ గౌడ్ టీఆర్ఎస్ లో చేరితే, కాంగ్రెస్ పార్టీకి హైదరాబాద్ లో పెద్ద ఎదురుదెబ్బే అని చెప్పచ్చు!