PLASTIC BOTTLES: ఏపీ, తెలంగాణలోని రైల్వే స్టేషన్లలో ప్లాస్టిక్ బాటిళ్ల క్రషింగ్ యంత్రాలు
- తెలంగాణలో సికింద్రాబాద్, కాచిగూడ, నిజామాబాద్ స్టేషన్లలో
- ఏపీలోని విజయవాడ రైల్వే స్టేషన్లో ఏర్పాటు
- ఒక్కో మెషిన్ కు రోజుకు 5,000 బాటిళ్లను క్రష్ చేసే సామర్థ్యం
పర్యావరణ పరిరక్షణ చర్యల్లో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో ఎంపిక చేసిన ప్రధాన రైల్వే స్టేషన్లలో ప్లాస్టిక్ బాటిళ్ల నిర్వీర్య యంత్రాలను ఏర్పాటు చేశారు. సికింద్రాబాద్, కాచిగూడ, నిజామాబాద్, విజయవాడ రైల్వే స్టేషన్లలో వీటిని ఏర్పాటు చేసినట్టు రైల్వే అధికారులు తెలిపారు.
ఈ యంత్రాలు రిఫ్రిజిరేటర్ అంత సైజుతో ఉంటాయి. ఒక్కో మిషన్ రోజులో 5,000 బాటిళ్లను క్రష్ చేయగలదు. అనంతరం ఆయా బాటిళ్లు ప్లాస్టిక్ ముక్కలుగా బయటకు వస్తాయి. వీటిని తుక్కు కింద విక్రయించడానికి కానీ, లేదా బ్యాగులు, టీ షర్టుల తయారీకి కానీ పనికి వస్తాయని రైల్వే అధికారుల కథనం. ప్రయాణికులు ఎవరైనా ఖాళీ ప్లాస్టిక్ బాటిళ్లను ఈ మెషిన్ లో వేయవచ్చని దక్షిణ మధ్య రైల్వే ముఖ్య ప్రజా సంబంధాల అధికారి ఉమాశంకర్ తెలిపారు.