Wimbledon: చరిత్ర సృష్టించిన సైనికుడు... వింబుల్డన్ మెయిన్ డ్రాకు సుబేదార్ శ్రీరామ్ బాలాజీ
- ఆర్మీలో నాయబ్ సుబేదార్ గా ఉన్న శ్రీరామ్ బాలాజీ
- విష్ణు వర్థన్ తో కలసి మెయిన్ డ్రాకు అర్హత
- పురుషుల డబుల్స్ ఆడనున్న జంట
వింబుల్డన్ మెయిన్ డ్రాకు అర్హత సాధించిన తొలి భారత సైనికుడిగా నాయబ్ సుబేదార్ శ్రీరామ్ బాలాజీ చరిత్ర సృష్టించాడు. ఈ విషయాన్ని భారత సైన్యాధికారి ఒకరు ప్రకటిస్తూ, సైనిక చరిత్రలో ప్రతిష్ఠాత్మక వింబుల్డన్ టెన్నిస్ టోర్నీకి ఇలా జవాను సెలక్ట్ కావడం ఇదే తొలిసారని అన్నారు. పురుషుల డబుల్స్ కేటగిరీలో విష్ణు వర్థన్ తో కలసి బాలాజీ ఆడనున్నాడు. వింబుల్డన్ క్వాలిఫయర్స్ పోటీలో డెన్సీ మోల్చనోవ్, ఇగోర్ జిలానే జోడీపై విష్ణు, బాలాజీ జంట 6-3, 6-4 తేడాతో విజయం సాధించింది. దీంతో వీరి జోడీ వింబుల్డన్ మెయిన్ డ్రాకు క్వాలిఫై అయింది.
గడచిన 14 నెలల కాలంలో, వీరిద్దరి జోడీ ఏటీపీ చాలెంజర్ సర్క్యూట్ టోర్నీల్లో ఏడింట ఫైనల్స్ వరకూ ప్రవేశించింది. వీటిల్లో ఐదు టైటిళ్లు కూడా గెలిచింది. వింబుల్డన్ పోటీల్లో శ్రీరామ్ బాలాజీతో కలసి శక్తి మేరకు ఆడి సత్తా చాటాలని నిర్ణయించినట్టు ఈ సందర్భంగా విష్ణు వర్థన్ వ్యాఖ్యానించాడు.