rupee fallen: డాలర్ తో జీవితకాల కనిష్ఠ స్థాయికి పతనమైన రూపాయి!
- ఫారెక్స్ మార్కెట్లో 68.89 వద్ద మొదలైన ట్రేడింగ్
- ఇప్పటి వరకు రూపాయి చరిత్రలోనే తక్కువ స్థాయి
- రానున్న రోజుల్లో 70.50 వరకు వెళ్లొచ్చని విశ్లేషకుల అంచనా
డాలర్ మారకంతో రూపాయి విలువ జీవిత కాల కనిష్ఠ స్థాయికి పడిపోయింది. ఈ రోజు ఫారెక్స్ మార్కెట్లో రూపాయి ట్రేడింగ్ 68.89తో ప్రారంభమైంది. ఇది రూపాయి చరిత్రలోనే అత్యంత తక్కువ. తర్వాత మరింత క్షీణించి 69.01 వరకు వెళ్లింది. బ్యాంకులు, చమురు దిగుమతి సంస్థల నుంచి డాలర్లకు డిమాండ్ ఏర్పడడంతో రూపాయి పతనాన్ని చవిచూసింది.
రూపాయి నిన్న డాలర్ తో 37 పైసలు తగ్గి 19 నెలల కనిష్ట స్థాయిలో 68.61 వద్ద క్లోజ్ అయింది. ఈ రోజు మరింత బలహీనత కనిపిస్తోంది. రూపాయి విలువను నిలబెట్టేందుకు ఆర్ బీఐ 68.80-68.85 స్థాయిలో జోక్యం చేసుకుంటుందని తాము భావిస్తున్నట్టు ఆనంద్ రాఠి కమోడిటీస్ రీసెర్చ్ అనలిస్ట్ రుషబ్ మారు తెలిపారు. రానున్న సెషన్లలో రూపాయి 70-70.50 స్థాయులకు వెళుతుందని అంచనా వేస్తున్నట్టు చెప్పారు.