Rajasthan: ఇకపై అలాంటి దుస్తులకు నో.. ఉద్యోగులకు డ్రెస్‌కోడ్ విధించిన రాజస్థాన్
- ఉద్యోగులకు డ్రెస్ కోడ్‌పై కార్మిక శాఖ సర్క్యులర్
- తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఉద్యోగుల సంఘం
- సర్క్యులర్ వెనక్కి తీసుకోవాలని డిమాండ్
ఉద్యోగులు ఇకపై అసభ్యకరంగా ఉన్న దుస్తులు వేసుకుని రావద్దంటూ రాజస్థాన్ కార్మిక శాఖ సర్క్యులర్ జారీ చేసింది. కార్యాలయాలకు ఉద్యోగులు తరచూ జీన్స్, టీషర్టులు, అసభ్యకరమైన దుస్తులు ధరించి వస్తున్నారని, దీని వల్ల కార్యాలయ గౌరవం దెబ్బతింటోందని కార్మిక శాఖ కమిషనర్ గిరిరాజ్ సింగ్ కుశ్వాహ ఆవేదన వ్యక్తం చేశారు.
ఇకపై అందరూ కార్యాలయ గౌరవాన్ని కాపాడేలా మర్యాదకరమైన, హుందాగా ఉండే దుస్తులు ధరించాలని కోరుతున్నట్టు పేర్కొన్నారు. ఉద్యోగులు ప్యాంటులు, షర్టులు మాత్రమే ధరించి రావాలని సర్క్యులర్‌లో పేర్కొన్నారు. గతంలోనూ ఇటువంటి సర్క్యులర్ జారీ చేసినా, ఉద్యోగుల నుంచి ఫీడ్ బ్యాక్ మాత్రం రాలేదన్నారు.
కార్మికశాఖ సర్క్యులర్‌పై ఉద్యోగులు మండిపడుతున్నారు. తాము ఎటువంటి దుస్తులు ధరించాలో కూడా వారే చెబుతారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆల్ రాజస్థాన్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ అధ్యక్షుడు గజేంద్ర సింగ్ మాట్లాడుతూ.. డ్రెస్‌కోడ్‌ను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు చెప్పారు. సర్క్యులర్‌ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.