Yanamala: జగన్.. ఇప్పటికైనా నోరు విప్పండి!: యనమల
- ఉక్కు పరిశ్రమ కావాలో, వద్దో చెప్పండి
- జగన్ కేసుల మాఫీ పనిలో విజయసాయి రెడ్డి బిజీ
- వైఎస్ వల్లే రాష్ట్ర విభజన: సునీత
కడపకు ఉక్కు పరిశ్రమ కావాలో, వద్దో ప్రతిపక్ష నేత నోరు విప్పి చెప్పాలని ఏపీ మంత్రి యనమల రామకృష్ణుడు డిమాండ్ చేశారు. ఉక్కు పరిశ్రమ కోసం ఎనిమిది రోజులుగా దీక్షలు జరుగుతుంటే నోరెందుకు విప్పడం లేదని ప్రశ్నించారు. ఈ విషయంలో ఏదో ఒకటి చెప్పాలని నిలదీశారు. జగన్‌కు నీతి, నిజాయతీ ఉంటే ఎంపీ సీఎం రమేశ్, ఎమ్మెల్సీ బీటెక్ రవిల ఆమరణ దీక్షకు సంఘీభావం చెప్పాలన్నారు. బుధవారం దీక్షా శిబిరాన్ని యనమల సహా మంత్రులు గంటా శ్రీనివాసరావు, పరిటాల సునీత, సుజనా చౌదరి సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా యనమల మాట్లాడుతూ జగన్‌పై విరుచుకుపడ్డారు.
ఉక్కు ఫ్యాక్టరీ వల్ల 40 వేల మందికి ప్రత్యక్షంగా, లక్షమందికి పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. 12 చార్జిషీట్లలో ముద్దాయిగా ఉన్న జగన్ కేసుల మాఫీ కోసం ఎంపీలతో దీక్ష చేయించారని అన్నారు. ప్రధాని కార్యాలయం చుట్టూ విజయసాయి రెడ్డి తిరుగుతున్నది అందుకేనని ఆరోపించారు.
ప్రాణాలు పణంగా పెట్టి ఇద్దరు నాయకులు దీక్ష చేస్తుంటే జగన్ నోరు తెరిచి ఒక్క మాట కూడా మాట్లాడడం లేదని మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి వల్లే రాష్ట్ర విభజన జరిగిందని మరో మంత్రి పరిటాల సునీత ఆరోపించారు.