Andhra Pradesh: లెర్నింగ్ లింక్స్ ఫౌండేషన్, వొడాఫోన్లతో మెప్మా అవగాహన ఒప్పందాలు: ఏపీ మంత్రి నారాయణ

  • పట్ణణ పేద మహిళల్లో ఆర్థిక అవగాహన పెంచేందుకు శిక్షణ
  • మంత్రి నారాయణ సమక్షంలో పత్రాలు మార్చుకున్న ఇరువర్గాలు
  • వివిధ దశల్లో 20 లక్షల మంది మహిళలకు శిక్షణ
  • సగటు ఆదాయం పెంచేందుకు ఒప్పందాలు

ఆర్థిక పరమైన అవగాహన ద్వారానే పట్ణణ పేద మహిళల జీవితాల్లో వెలుగులు నింపవచ్చని ఆంధ్రప్రదేశ్‌ పురపాలక మంత్రి నారాయణ అన్నారు. ఈరోజు ఆయన సమక్షంలో లెర్నింగ్ లింక్స్ ఫౌండేషన్, వొడాఫోన్ ఇండియా ఫౌండేషన్ సంయుక్తంగా మెప్మాతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందాల ప్రకారం మెప్మాలోని 20 లక్షల మంది పట్టణ పేద మహిళలకు ఆర్థికపరమైన అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు.

డబ్బు ఎలా సంపాదించాలి? ఎలా ఖర్చు పెట్టాలి? ఎలా దాచుకోవాలి? తీసుకున్న రుణాలను ఎలా సద్వినియోగం చేసుకోవాలి? తిరిగి బ్యాంకు లోన్లు చెల్లించే సందర్భంలో పాటించాల్సిన విధానాలేంటి? వంటి అన్ని అంశాలపై ఈ కార్యక్రమం ద్వారా మహిళలకు అవగాహన కల్పిస్తారు. లెర్నింగ్ లింక్స్ పౌండేషన్ వివిధ ప్రాంతాల్లో దశల వారీగా నిర్వహించే శిక్షణా కార్యక్రమాలకు, వోడాఫోన్ ఇండియా ఫౌండేషన్ సి.ఎస్.ఆర్ ఫండ్స్ ద్వారా ఆర్థిక సహకారం అందిస్తుంది.

నెలకు పదివేల సంపాదన లక్ష్యం...
తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చే సమయానికి 2014లో మెప్మాలోని మహిళల వార్షిక సగటు ఆదాయం రూ.36,000 కాగా, 2018కి వారి ఆదాయం గణనీయంగా పెరిగి 68,000 లకు చేరిందని పురపాలక మంత్రి నారాయణ అన్నారు. 2020 కల్లా పట్టణాల్లోని ప్రతి పేద కుటుంబం వార్షిక ఆదాయం రూ.1,20,000 సంపాదించేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోవాలంటే మహిళల్లో ఆర్థికపరమైన అవగాహన కల్పించడం తప్పనిసరని, లెర్నింగ్ ఫౌండేషన్ సంస్థతో చేసుకున్న ఒప్పందం ఈ దిశగా మంచి ఫలితాలు ఇవ్వగలదని మంత్రి పేర్కొన్నారు.

ఈ కార్యక్రమం చేపట్టిన మెప్మా ఎండీ చినతాతయ్యను మంత్రి అభినందించారు. అలాగే, రాష్ట్రంలోని పేద కుటుంబాలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలు 100 శాతం అందేలా 35 కుటుంబాలకు ఒకరు చొప్పున 4 లక్షల మంది మహిళలను సాధికార మిత్రలుగా నియమించి ముఖ్యమంత్రి సంక్షేమ ఫలాలు అందరికీ పంచేలా మంచి నిర్ణయం తీసుకున్నారని మంత్రి కొనియాడారు.

  • Loading...

More Telugu News