Chandrababu: మంచి కోసం పాటుబడాలి.. చెడును సంస్కరించాలి: సీఎం చంద్రబాబు

  • ఇటీవల శిక్షణ పూర్తి చేసుకున్న ఎస్ఐల తో చంద్రబాబు భేటీ 
  • ఉన్నత విద్యావంతులు సబ్ ఇన్ స్పెక్టర్లుగా రావడం సంతోషం
  • శాంతి భద్రతల విషయంలో దేశానికే ఆదర్శంగా ఏపీ నిలవాలి

ఏపీలో పోలీసు వ్యవస్థ పటిష్టంగా రూపొందాలని కొత్తగా ఉద్యోగాలలో చేరబోతున్న సబ్ ఇన్ స్పెక్టర్లందరూ మంచికోసం పాటుబడాలని, చెడును సంస్కరించాలని సీఎం చంద్రబాబు సూచించారు. ఇటీవల శిక్షణ పూర్తి చేసుకున్న 652 మంది ఎస్ఐలతో ముఖ్యమంత్రి తన నివాసం వద్ద ప్రజావేదికలో సమావేశమయ్యారు. డీజీపీ మాలకొండయ్య, హోం శాఖ కార్యదర్శి అనురాధ, పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్, ఇంటెలిజెన్స్ అడిషనల్ డైరక్టర్ వెంకటేశ్వరరావు తదితరులు ఇందులో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఉన్నత విద్యావంతులు సబ్ ఇన్ స్పెక్టర్లుగా రావడంపై చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. శాస్త్ర సాంకేతికతలో అనుభవం ఉన్నవారు పోలీస్ వ్యవస్థలోకి రావడం వల్ల పోలీసింగ్ మరింత పటిష్టం అవుతుందని అన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, శాంతి భద్రతల విషయంలో దేశానికే ఆదర్శంగా ఆంధ్రప్రదేశ్ నిలవాలని, ప్రపంచంలోనే సురక్షిత గమ్యస్థానంగా ఏపీ రూపొందే రోజు త్వరలోనే వస్తుందని అన్నారు.

డబ్బుతో ఆనందం రాదని, భద్రతతోనే ఆనందం సిద్ధిస్తుందని, అభద్రతను, అనిశ్చితిని దూరం చేసేదే పోలీసువ్యవస్థ అని కొనియాడారు. ఏ దుర్ఘటన జరిగినా, విపత్తు వాటిల్లినా ముందుగా స్పందించేది పోలీసులేనని, వినూత్న ఆలోచనల ద్వారా కొత్త ఆవిష్కరణలకు నాంది పలకాలని, నాగరిక సమాజంలో శాంతిభద్రతలు ఎంతో ముఖ్యమని అన్నారు.

గతంలో పోలీసులంటే గట్టిగా ఉంటారని, లాఠీలకే పనిచెబుతారని అనుకునేవారని, ఇప్పుడు ఆ పరిస్థితి మారిందని, పోలీసింగ్ కనబడాలే తప్ప పోలీస్ ఇన్విజిబిల్ అనేది గుర్తుంచుకోవాలని సూచించారు. యుక్తవయసులో ఆశయాలు ఉంటాయని, ఇది స్ఫూర్తిదాయక కాలమని, ఏది సాధించాలి అనుకుంటే అది సాధించే సమయంలో ఉన్నారని సబ్ ఇన్ స్పెక్టర్లకు చెప్పారు.
 
2050 నాటికి ప్రపంచంలోనే ఏపీ అత్యుత్తమ రాష్ట్రం కావాలనేది తన ఆశయమని, అప్పటికి వీళ్లందరూ ఇంకా సర్వీస్ లోనే ఉంటారని, ఇప్పుడు బాధ్యతలు చేపడుతున్న వీళ్లు మరో 35 ఏళ్లు విధుల్లో ఉంటారని, ‘నా విజన్ 2022, 2029, 2050’లో వీళ్లు భాగస్వాములు అవుతారని, వాటి ఫలితాలను స్వయంగా చూస్తారని, ఆస్వాదిస్తారని చంద్రబాబు అన్నారు.
పోలీస్ అధికారులు మనస్తత్వ శాస్త్రాన్ని(సైకాలజి) అధ్యయనం చేయాలని, సానుకూల ధోరణి (పాజిటివ్ యాటిట్యూడ్) పెంచేందుకు దోహద పడాలని, ప్రతికూల స్వభావం(నెగెటివిటి) సమాజానికి కీడుచేస్తుందని చెప్పారు. నేరం జరిగాక పరిశోధనకే సీపీ కెమెరాలను పరిమితం చేయరాదరని, రియల్ టైమ్ ఇన్వెస్టిగేషనే కే కాకుండా, రియల్ టైమ్ డిటెక్షన్ కు కూడా వీటిని వినియోగించుకోవాలని సూచించారు.

గతంలో హైదరాబాద్ లో మతకల్లోలాలు ఉండేవని, మతవిద్వేషాన్ని రెచ్చగొట్టేవారని, రాయలసీమలో ఫ్యాక్షనిజం, కోస్తాలో రౌడీయిజం ఉండేవని అన్నారు. తాను తొలిసారి ముఖ్యమంత్రి కాగానే వీటన్నింటిపై కఠినంగా వ్యవహరించానని, అప్పట్లో దాదాపు హైదరాబాద్ దరిదాపుల వరకు నక్సలైట్లు వచ్చేశారని, బస్తీకి ఒక రౌడీ ఉండేవాడని, నగరం అంతా కర్ఫ్యూ ఉండేదని గుర్తుచేసుకున్నారు.

ఏడేళ్లలోనే శాంతిభద్రతలను కంట్రోల్ లోకి తెచ్చానని, తిరుపతిలో ప్రాణాధారం ట్రస్ట్ ప్రారంభానికి వెళ్లినప్పుడు తనపై అలిపిరి వద్ద దాడి జరిగిందని, నాలుగైదు క్లైమోర్ మైన్స్ తన వాహనాన్ని తాకినప్పటికీ తాను బెదిరిపోలేదని, రెండు నిమిషాలు ఏం జరిగిందో తనకు తెలియలేదని నాడు తనకు జరిగిన సంఘటన గురించి ప్రస్తావించారు. ఎవరో తన కారు డోర్ తీస్తే, బైటకు వచ్చి అంబులెన్స్ ఎక్కగానే స్పృహ తప్పానని, కొద్దిసేపటికే తేరుకుని పక్కన ఉన్న ఎస్పీని ‘ఇక్కడ ఎందుకు ఉన్నారు?’ అని అడిగిన విషయాన్ని గుర్తుచేసుకున్నారు. నిందితులను పట్టుకోవాలికదా? అనేదే తన ఆలోచన అని, దాడులు, దుర్ఘటనలు, విపత్తులలో ధైర్యం కోల్పోరాదని, స్థిమితంగా ఉండి, సమర్ధంగా వ్యవహరించాలని ఇన్ స్పెక్టర్లకు సూచించారు.

వాజ్ పేయి ప్రధానిగా ఉండగా విఎస్ఎన్ ఎల్, బీఎస్ఎన్ఎల్ ఉండేవని, విదేశాలకు ఫోన్లు చేస్తే బిల్లులు తడిసిమోపెడు అయ్యేవని, లైటెనింగ్ కాల్స్ అంటే వారం తరువాత ఇచ్చేవారని, ఇప్పుడు సెల్ ఫోన్లు వచ్చాయని, వాట్సాప్ కాల్స్ ద్వారా విదేశాలకు చేస్తున్నారని అన్నారు. పర్ కేపిటా బ్యాండ్ విడ్త్ వినియోగాన్ని అనుసరించి బిల్లులు వచ్చేరోజు వస్తుందని అప్పుడే చెప్పాను. అదే జరిగింది. ఇప్పుడు ఐఓటి వచ్చిందని, ఫోర్త్ ఇండస్ట్రియల్ రివల్యూషన్ లో ఉన్నామని, మన విజన్ ఎప్పుడూ ఇరవైఏళ్లు ముందుండాలని చంద్రబాబు అన్నారు.

గతంలో తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా రాష్ట్రంలో పారిశ్రామిక అశాంతి లేకుండా చేశానని, అశాంతి ఉంటే పెట్టుబడులు, పారిశ్రామిక వేత్తలు రారని, పరిశ్రమలు రాకపోతే యువతకు ఉపాధి ఉండదని చెప్పారు. కొందరు వ్యక్తులు, కొన్ని పార్టీలు స్వలాభం కోసం అశాంతి సృష్టించాలని చూస్తున్నాయని, వాటి కుట్రలను సకాలంలో గుర్తించి, వాటిని భగ్నం చేయాలని అన్నారు.

రోజులు మారుతున్న కొద్దీ  కొత్తకొత్త నేరాలు జరుగుతున్నాయని, మానవ విలువలు అంతకంతకు దిగజారుతున్నాయని, సాంకేతికతతో ఎంత లాభం ఉందో అంత చేటు కూడా ఉందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. మంచికే సాంకేతికతను ఉపయోగించుకోవాలి తప్ప కీడు చేసేందుకు వాడకూడదని, చిన్నారులపై లైంగికదాడులు, మహిళలపై నేరాలు, గృహ హింస పెరగడం ఆందోళన కలిగిస్తోందని, నేర ప్రవృత్తి తగ్గేలా కౌన్సిలింగ్ నిర్వహించాలని, నేరం చేస్తే తప్పించుకోగలమనే  ధీమా ఉంటే నేరాలు మరింతగా పెరుగుతాయని, తప్పించుకోలేమనే భావన వస్తే నేరం చేయాలన్న ఆలోచనలు కూడా తగ్గుతాయని అన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా 20 వేల సీసీ కెమెరాలు ఏర్పాటు చేయబోతున్నామని, వైఫై సదుపాయం విస్తృతం చేస్తున్నామని, ప్రతి ఇంటికి 15 ఎంబీపీఎస్ ఇంటర్నెట్, ప్రి-స్పేస్ ఆప్టిక్ కనెక్టివిటి ఇస్తున్నామని, డ్రోన్లు, మొబైల్ కంట్రోల్ రూములు, సీసీ కెమెరాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఒకప్పుడు అమెరికాను భద్రమైన దేశంగా భావించేవారని, ఇప్పుడు అక్కడివారు అభద్రతాభావంలో ఉన్నారని.. తుపాకీ కల్చర్ పెరిగిపోయిందని, ఎక్కడ భద్రత ఉంటే అక్కడ ఆనందం ఉంటుందని, ప్రశాంత జీవనం ఉంటుందని చెప్పారు.

ఈ సందర్భంగా దాచేపల్లి, పాత గుంటూరులో జరిగిన దుర్ఘటనల గురించి చంద్రబాబు ప్రస్తావించారు. దాచేపల్లిలో అత్యాచార ఘటనపై కొంతమంది రాజకీయం చేశారని, నిందితుడిని వెంటనే అదుపులోకి తీసుకోవాలని ఆదేశించానని, పోలీసులు అతనిని పట్టుకునేలోపే నిందితుడు ఆత్మహత్య చేసుకున్నాడని అన్నారు. అదేవిధంగా పాత గుంటూరులో కూడా అరాచక శక్తులు సోషల్ మీడియా ద్వారా రెచ్చగొట్టారని, దాడులకు పురిగొల్పారని, ఇటువంటి దుర్ఘటనల పట్ల ముందే అప్రమత్తం కావాలని, విధ్వంసాలను ముందే నివారించగలగాలని సూచించారు.

కాగా, ఇటీవల శిక్షణ పూర్తి చేసుకున్న 652 మంది ఎస్ఐలలో 42% బీటెక్, 3%ఎంటెక్, 20%పోస్ట్ గ్రాడ్యుయేషన్, 35% మంది డిగ్రీ చదివిన వారు ఉన్నారని, 342 మంది సివిల్ ఎస్ ఐలు కాగా 108 మంది ఎఆర్ ఎస్ ఐలు,ఆర్ ఎస్ ఐలు 11 మంది,141మంది మహిళా ఎస్ ఐలు ఉన్నారని, వీరితో పాటు  5250 మంది కానిస్టేబుళ్లకు శిక్షణ పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. 

  • Loading...

More Telugu News