Passport: పాస్‌పోర్ట్ కి దరఖాస్తు చేయడం ఇక ఈజీ.. మొబైల్ యాప్ విడుదల!
- మొబైల్ నుంచే పాస్‌పోర్టు దరఖాస్తు
- దేశంలో ఎక్కడి నుంచైనా దరఖాస్తు చేసుకోవచ్చు
- రుసుము కూడా మొబైల్ నుంచే
పాస్‌పోర్టు దరఖాస్తు కష్టాలకు ఇక చెక్ పడినట్టే. ఇప్పుడు కూర్చున్న చోటు నుంచే ఫింగర్ టిప్ ద్వారా పాస్‌పోర్టుకు దరఖాస్తు చేసుకునే సౌలభ్యం అందుబాటులోకి వచ్చింది. మంగళవారం ఢిల్లీలో నిర్వహించిన పాస్‌పోర్టు సేవా దివస్‌ను పురస్కరించుకుని కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ ‘ఎంపాస్‌పోర్టు సేవా’ యాప్‌ను ప్రారంభించారు.
గూగుల్ ప్లే స్టోర్ నుంచి దీనిని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇంట్లో కూర్చునే దరఖాస్తును నింపుకోవచ్చు. పాస్‌పోర్టు కోసం చెల్లించాల్సిన నిర్ణీత రుసుములను కూడా మొబైల్ ద్వారానే చెల్లించే వీలుంది. అంతేకాక, ఒకసారి దరఖాస్తు పూర్తి చేసి, పంపిన తర్వాత తమ దరఖాస్తు ఎప్పుడు ఏ స్టేజిలో ఉందో తెలుసుకునే వీలుంది. ఇక్కడ ఇంకో ముఖ్య విషయం ఏమిటంటే.. ఇప్పటి వరకు దరఖాస్తుదారు తమ ప్రాంత పరిధిలోనే పాస్‌పోర్టు కోసం దరఖాస్తు చేసుకోవాలనే నియమం ఉండేది. ఇప్పుడా నిబంధన లేదు. ఎవరు ఎక్కడి నుంచైనా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుదారు పేర్కొన్న చిరునామాకే పాస్‌పోర్టును పంపుతారు.
మరో ముఖ్యమైన విషయం .. పాస్‌పోర్టు జారీ సందర్భంగా గతంలో పోలీస్ వెరిఫికేషన్ ఉండేది. పోలీసులు ఇచ్చే నివేదికపైనే పాస్‌పోర్టు జారీ చేసేవారు. అయితే, ఇప్పుడా నిబంధన లేదు. పోలీస్ వెరిఫికేషన్‌ను తొలగించారు. దరఖాస్తుదారుడికి ప్రభుత్వం వివిధ గుర్తింపు కార్డులు జారీ చేసినప్పుడు మళ్లీ వాటిని తనిఖీ చేయాల్సిన అవసరం లేదని తేల్చారు. దరఖాస్తుదారుడిపై కేసులు ఉన్నాయా? లేదా? అన్న దానికి మాత్రమే పోలీస్ వెరిఫికేషన్ పరిమితం కానుంది. ఎంపాస్‌పోర్టు సేవా యాప్‌ను ప్రారంభించిన అనంతరం మంత్రి సుష్మా స్వరాజ్ మాట్లాడుతూ.. ఈ యాప్‌ను పాస్‌పోర్టు విప్లవంగా అభివర్ణించారు.